తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బోత్సపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నువ్వా మాకు చెప్పేదంటూ మండిపోతున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తన మంత్రవర్గం నుంచి బొత్స సత్యనారాయణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతిరోజూ చూస్తూనే ఉన్నామని బొత్స విమర్శలు గుప్పించడంతో తెలంగాణ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. విజయవాడలో గురువారం ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను బొత్స ప్రకటించిన సందర్భంగా తెలంగాణ విద్యా విధానంపై మాట్లాడుతూ ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలను కూడా సక్రమంగా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందని విమర్శించారు. మన విద్యా విధానం మనదని, మన ఆలోచనలు మనవని చెప్పారు.
తెలంగాణ విద్యావ్యవస్థ గురించి ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే సహించబోమని ఆమె హెచ్చరించారు. బొత్స చేసిన వ్యా ఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఏపిలో విద్యా వ్యవస్ధ బాగుంటే లక్షమంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ఆమె ప్రశ్నించారు. . ‘ మీ రాష్ట్ర విద్యా వ్యవస్థ బాగుంటే, నాడు-నేడు కార్యక్రమం చేట్టిన తరువాత మీ విద్యాసంస్థల్లో లక్ష మంది విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది?’ అని ఆమె సూటిగా బొత్సను నిలదీశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏపి మాత్రం విరుద్దంగా మాట్లాడం శోచనీయమని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్ధను మెరుగు పరుస్తున్నామని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ఆమె కొనియాడారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత 1050 గురుకులాలు ఏర్పాటు చేశామని సబితా వెల్లడించారు. తెలంగాణలో ఒక్కో విద్యార్థిపైన రూ. 1.50లక్షల ఖర్చు చేస్తున్నామని, విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఓఆర్‌సీసి కింద ప్రతి విద్యార్ధికి రూ.2.50లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. గడిచిన 9 ఏళ్లలో రెండుసార్లు ఉపాధ్యాయులను బదిలీలు ఆమె గుర్తు చేశారు. కొంతమంది ఉపా ధ్యాయులు కోర్టుకు వెళ్లడంతో బదిలీలు ఆగాయని తెలిపారు.
“బొత్స సత్యనారాయణ, ముందు నువ్వు తెలుసుకో నీ దగ్గర ఉన్న గురుకులాలు ఎన్ని మా దగ్గర ఎన్ని ఉన్నాయో చూడు. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు నీ దగ్గర విద్యా వ్యవస్థ ఉందా నువ్వా మా విద్యార్థుల గురించి మాట్లాడేది” అంటూ మంత్రి గంగుల కమలాకర్ నిప్పులుచెరిగారు.
తెలంగాణపై ఇంకా కుట్రలేనా అంటూ ఆయన విరుచుకుపడ్డారు. తాము ఏపీ జోలికి వెళ్లలేదని, మాట్లాడుతున్నందుకు తాము ఏం చేశామనేది చెప్పుకొవాల్సి వస్తోందని పేర్కొన్నారు. నాడు కాంగ్రెస్ మంత్రిగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన బొత్స నేడు వైఎస్సార్సీపీ మంత్రిగా అదే వైఖరి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
టీఎస్‌పీఎస్సీ పరిధిలో జరిగిన తప్పును గుర్తించి, దొంగలను పట్టుకున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్న విషయాన్ని బొత్స గుర్తించాలని మంత్రి గుంగల కమలాకర్ చురకలేశారు. ఏపీలో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారని, అందులో ఏ ఒక్కరినైనా పట్టుకున్నారా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన సీతారామరాజు రూ.10 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ విషయాన్ని మరిచిపోయారా? అని నిలదీశారు.
మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఏపీ ఉందని ఎద్దేవా చేశారు. వారికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. బొత్స ఎవరు? వోక్స్‌వ్యాగన్ కార్లను చూస్తే గుర్తొచ్చేది ఆయనే కదా?” అంటూ ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఏపీలో ఆయన ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీలో అంతులేని అవినీతికి పాల్పడ్డారని విరుచుకుపడ్డారు.