తెలంగాణ రాజకీయాలలో చంద్రబాబు `కింగ్ మేకర్’ కానున్నారా?

Saturday, January 18, 2025

టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా దేశవ్యాప్త పర్యటనలు జరిపి, జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ కు ఇప్పుడు సొంత రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖమ్మం బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించడం ఖంగారు పుట్టిస్తున్నది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత టీడీపీ జరిపిన అతిపెద్ద బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం. 

తెలంగాణాలో టిడిపికి ఒక ఎమ్యెల్యే గాని, ఎమ్యెల్సీ గాని, ఎంపీ గాని లేరు. జిల్లా పరిషద్, మండల పరిషద్ లలో సహితం ఆ పార్టీ లేదు. బలమైన నాయకులు, గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు అనేకమంది ఇతర పార్టీలలో సర్దుకున్నారు. కొందరు కేసీఆర్ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. 

అయినా, అంతభారీగా జనం తరలి రావడం, పైగా చాలావరకు తమకై తాము ఆసక్తిగా రావడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తున్నది. రాష్ట్ర నిఘా వర్గాల అంచనా ప్రకారం బహిరంగసభకు రెండు లక్షల మంది రాగా, మరో లక్షమంది వరకు రోడ్ షో లో పాల్గొన్నారు. “మేము కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. ఎవ్వరికీ వారే తమ ఏర్పాట్లు చేసుకొని వచ్చారు” అంటూ తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. 

తెలంగాణాలో టిడిపి తుడిచిపెట్టుకు పోయిందని అందరూ అనుకొంటున్న సమయంలో ఈ భారీ బహిరంగసభ చూసినవారికి నాయకత్వం ఆసక్తి చూపితే తిరిగి పార్టీ పుంజుకొంటుందనే సంకేతాలు వెలువడ్డాయి. పైగా, వివిధ కారణాలతో పార్టీని వదిలి వెళ్లిన నాయకులను తిరిగి రమ్మనమని చంద్రబాబు నాయుడు బహిరంగ పిలుపిచ్చారు. 

ఇప్పుడు, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు కొంతవరకు బీజేపీలో సహితం మాజీ టిడిపి నేతలు కీలక స్థానాలలో ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ లో చెలరేగిన కల్లోలంకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని `మాజీ టిడిపి’ నేతలే కావడం గమనార్హం. ఇతర పార్టీలకు వెళ్ళినవారు అక్కడ  సరిగ్గా సర్దుబాటు కాలేకపోతున్నట్లు స్పష్టం అవుతుంది. 

టిఆర్ఎస్ లో కడియం శ్రీహరి వంటి మాజీ టిడిపి అగ్రనేతలు అంత సంతోషంగా లేరు. అదేవిధంగా బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు వంటివారు సహితం అసంతృప్తిగా ఉన్నారు. కనీసం 40 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ నిర్ణయాత్మక రాజకీయ శక్తి అని అందరూ అంగీకరిస్తున్నారు. 

ఖమ్మం సభ విజయవంతం కావడం కేసీఆర్ పాలన  పట్ల ప్రజలలో నెలకొన్న అసంతృత్తిని వెల్లడిస్తే, ప్రత్యామ్న్యాయం పట్ల ప్రజలలో నెలకొన్న గందరగోళాన్ని సహితం వెల్లడి చేస్తున్నది. కేసీఆర్ ను మేమంటే మేమె ఓడిస్తామని అంటున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలలో సహితం పలు సమస్యలు నెలకొన్నాయి. 
ముఖ్యంగా బిజెపికి క్షేత్రస్థాయిలో ఎన్నికల యంత్రాంగం లేదు. పోటీకి ధీటైన అభ్యర్థులు లేరు. అందుకనే మరే రాజకీయ పార్టీలో లేన్నట్లు `చేరికల కమిటీ’ అంటూ ఒకటి ఏర్పాటు చేసి, ఇతర పార్టీల నుండి ఫిరాయింపులకు ఎదురు చూస్తున్నది. అయినా ఇతర పార్టీలలో చెల్లుబాటుకాని వారు తప్పా బలమైన నేతలు ఎవ్వరు వచ్చి ఆ పార్టీలో చేరడం లేదు. 
ఇప్పుడు ఖమ్మం సభ చూస్తే టిడిపి లేకుండా కేసీఆర్ ను ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదని స్పష్టం అవుతుంది. టిడిపి కనీసం 10 నుండి 15 సీట్లు గెల్చుకొన్నా కొత్త ప్రభుత్వం ఏర్పాటులో `కింగ్ మేకర్’గా మారే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ 15 సీట్లు గెలుచుకోవడం గమనార్హం. ఈ పరిణామమే కేసీఆర్ కు కలవరం కలిగిస్తోంది

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles