కాంగ్రెస్ లో తాజాగా ప్రజాకర్షణ గల యువనేతగా ఎదుగుతున్న ప్రియాంక గాంధీ వచ్చే ఆరు నెలల పాటు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ కు వస్తున్నారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో జరుపుతున్న యువ సంఘర్షణ సభలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొంటున్నారు.
ఒక విధంగా మరో ఆరు నెలల్లో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు సన్నగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఆమె కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకొని, హైదరాబాద్ కు రావడం గమనార్హం. కర్ణాటక తర్వాత తెలంగాణాలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.
ప్రియాంక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రియాంక కేవలం గంటన్నర మాత్రమే పర్యటిస్తారని, సభలో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో, యూత్ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు నేతలు తెలిపారు. సరిగా సంవత్సరం క్రితం మే 6న రాహుల్ గాంధీ వరంగల్ లో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రసంగించి, రైతుల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా ప్రియాంక గాంధీని నియమించాలనే ప్రతిపాదన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ముందు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలలో ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణాలో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీచేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఆమె కేవలం కాంగ్రెస్ సభలో ఒక గంట సేపు మాత్రమే పాల్గొంటారు. మొత్తం రెండు గంటలసేపు మాత్రమే నగరంలో ఉంటారు. ఈ పర్యటన ముఖ్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరచి, వారిలో ఎన్నికల వేడి కలిగించేందుకు ఉద్దేశించినట్లు చెబుతున్నారు. ఒక వంక బిజెపి ఎన్నికల సన్నాహాలలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా వంటి హేమాహేమీలు తరచుగా తెలంగాణాలో ప్రయాణాలు జరుపుతున్నారు.
అయితే, కాంగ్రెస్ లో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మినహా ప్రజాకర్షణ గల నాయకులు ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. అందుకనే వచ్చే ఆరు నెలలలో ప్రియాంకతో పాటు రాహుల్ గాంధీ సహితం తరచూ తెలంగాణాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ కు సహితం తెలంగాణ ఎన్నికలలో కీలక ఆబాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పలు అంతర్గత సర్వేలలో తెలంగాణాలో పోటీ ప్రధానంగా బిఆర్ఎస్- కాంగ్రెస్ మధ్యనే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. బిజెపి బాగా వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నారు. కొంచెం కష్టపడితే, కాంగ్రెస్ నాయకులు ఉమ్మడిగా పోరాడితే తెలంగాణాలో అధికారంలోకి రావచ్చని పలు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ సీనియర్లను అదుపులో ఉంచి, దారితప్పకుండా చేసే ప్రయత్నం సీనియర్ నాయకుడు కె జానారెడ్డి ఒకవంక ప్రారంభించారు.