తెలంగాణ బీజేపీ నేతలు షో మాస్టర్లేనా! తేల్చేస్తున్న సునీల్ బన్సల్

Wednesday, January 22, 2025

ఒక వంక తెలంగాణకు బీజేపీ కేంద్ర పార్టీ ఇన్ ఛార్జ్ గా ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ కొనసాగుతూ ఉండగా, మరో ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ను కూడా ఇన్ ఛార్జ్ గా నియమించడం కేవలం మీడియాలో షో చేస్తూ, ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకొంటూ కాలం గడుపుతున్న పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తున్నది.

తరుణ్ ఛుగ్ ఇప్పటి వరకు తెలంగాణాలో పార్టీని పటిష్టం చేయడం గురించి పట్టించుకోకుండా, ఇక్కడి నాయకుల మర్యాదలతో సరిపుచ్చుకొంటూ కాలం గడుపుతూ వచ్చారు. అసలే బిజెపి నామమాత్రంగా ఉన్న పంజాబ్ లో క్షేత్రస్థాయిలో ఎటువంటి పట్టులేని తరుణ్ ఛుగ్ తెలంగాణాలో అంతకన్నా ఏమీ చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు.

ఈ విషయం గమనించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కొన్ని కారణాలతో తరుణ్ ఛుగ్ ను తెలంగాణ నుండి మార్చలేక, అదనంగా సునీల్ బన్సల్ ను పంపారు. సంస్థాగత వ్యవహారాలలో, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ఠపరచడంలో విశేష అనుభవం గల ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తెలంగాణ బిజెపి నేతలు సతమతమవుతున్నారు.

ఇప్పటివరకు సామర్ధ్యం గల నేతలను ప్రోత్సాహం ఇస్తే తమ బలహీనతలు వెల్లడవుతాయని భయంతో బండి సంజయ్, జి కిషన్ రెడ్డి, డా. కె లక్ష్మణ్ వంటి నాయకులు దూరంగా ఉంచుతూ వస్తున్న నాయకులతో బన్సల్ సమావేశాలు జరుపుతూ, వారి చెప్పేవి ఓపికగా వింటున్నారు. ఇదివరలో తరుణ్ ఛుగ్ ముక్తసరిగా వారి మాటలు  విన్నా, ఏమీ చేసేవారు కాదు.

ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండు సార్లు బిజెపి సొంత బలంపై ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా సునీల్ బన్సల్ కీలక పాత్ర వహించారు. అటువంటి క్షేత్రస్థాయి అనుభవం, సామర్ధ్యం కూడా తరుణ్ ఛుగ్ కు లేవు. ఆ అనుభవంతో తెలంగాణ పరిస్థితులను చూసిన ఆయన ఇక్కడి నాయకుల వ్యవహారంపై పెదవి విరుస్తున్నట్లు తెలిసింది.

కేవలం కేసీఆర్ ను తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించడం కోసం, పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రాజకీయ చేస్తున్నారని పదే పదే చెబుతూ, తెలంగాణ బిజెపి నేతలు తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల  పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు

రాజకీయ నేతలు రాజకీయాలే చేస్తారని, వారేమి సాదు పుంగవులు కారని అంటూ ఘాటుగా స్పందించడంతో నేతలు షాక్ అయ్యారట. గాలిలో కాకుండా గ్రౌండ్‌లో దిగి పని చేయాలని ఆయన సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేయడమే కాకుండా ఈ విధంగా ఏవో కుంటిసాకులతో కాలక్షేపం చేస్తూ పనిచేయని నేయాలకు పార్టీలో ఇక గుర్తింపు ఉండబోదని కూడా స్పష్టం చేశారని తెలిసింది.

ఎవరు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని.. బూత్ స్థాయిలో పని చేస్తున్న నేతలు ఎంతమంది అనే దానిపై సునీల్ బన్సల్ ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాలని ఆయన నేతలకు స్పష్టం చేశారు. తెలంగాణాలో వచ్చెడిది బిజెపి ప్రభుత్వమే అంటూ కబుర్లు చెప్పుకొంటూ కాలక్షేపం చేస్తున్న నేతలకు బన్సల్ వరుసగా షాక్ లు ఇస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles