తెలంగాణాలో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ అధినాయకత్వంకు రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టడంలో మాత్రం తీరిక ఉండడం లేదు. తెలంగాణాలో ప్రజలలోకి చొచ్చుకు పోగల నాయకత్వం కొరతగా ఉంటే, మరోవంక బహునాయకత్వం కొత్త సమస్యలను తీసుకొస్తున్నది.
అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయగల సమర్థులైన అభ్యర్థులు ప్రస్తుతం పార్టీలో లేరని గ్రహించిన బిజెపి జాతీయ నాయకత్వం ఇతర పార్టీల నుండి బలమైన నాయకులను ఆకర్షించడం కోసం ఏపార్టీలో లేని విధంగా `చేరికల కమిటీ’ని ఏర్పాటు చేసింది. అయితే తానే కాబోయే ముఖ్యమంత్రిని అని భావిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లో నెలకొన్న అభద్రతాభావం కారణంగా పార్టీలో బలమైన నాయకులు ఇమడలేక పోతున్నారని అభిప్రాయం నెలకొన్నది.
ఉపఎన్నికలలో అసెంబ్లీకి గెలుపొంది, తెలంగాణాలో బిజెపిని బలమైన పక్షంగా ప్రచారం చేసుకోవడానికి దోహదపడిన ఎన్ రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వంటి వారిని చూస్తే సంజయ్ లో అభద్రతాభావం పెరుగుతున్నది. అదేవిధంగా పలువురు నాయకులు కూడా సంజయ్ నుండి అవమానాలు ఎదుర్కొంటున్నట్లు నేరుగా జాతీయ నాయకత్వంకు ఫిర్యాదులు చేసారు.
మరోవంక, తెలంగాణాలో పార్టీ నాయకులకు కేంద్ర బిందువుగా పనిచేయవలసిన సంఘటనా కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. ఆ పదవిలో ఉన్న మంత్రి శ్రీనివాసులు సహితం ఏకపక్ష ధోరణులతో పార్టీలో కుంపట్లు పెడుతున్నారని హర్యానాకు పంపారు. కానీ ఆ స్థానంలో మరెవ్వరిని నియమించలేదు. దానితో ఎవ్వరి రాజ్యం వారిదిగా ఉంది.
సాధారణంగా కేంద్ర పార్టీ నుండి ఒకరిని రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా నియమిస్తారు. కానీ ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు – తరుణ్ ఛుగ్, సునీల్ భన్సాలీ ఇన్ ఛార్జ్ లుగా ఉన్నారు. వారిద్దరూ సహితం తలోదారిలో పోతూ రాష్ట్ర బీజేపీలో మరింత గంద్రగోళంకు కారణం అవుతున్నారు. తలో దిక్కుగా పార్టీని తీసుకు వెడుతున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి.
పార్టీలో కొత్తగా చేరేవారిని ఆదరించే నాయకత్వం లోపించినట్లు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటి వారు ఆందోళన చెందుతున్నారు. అందుకనే సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి మార్చాలనే డిమాండ్ పెరుగుతున్నారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం కేసీఆర్ తో సన్నిహితంగా పనిచేసిన ఈటెల రాజేందర్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా నియమించాలని కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
సంజయ్, ఈటెల కరీంనగర్ జిల్లాకు చెందినవారీ కావడంతో, క్షేత్రస్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలు గల ఈటెల చేరితో తన రాజకీయ ఉనికికి ప్రమాదకరం కాగలదని సంజయ్ తొలుత ఎన్నో ఆటంకాలు కల్పించారు. అటువంటిది ఇప్పుడు అధ్యక్ష పదవిని ఆయనకు అప్పచెప్పడం అంత తేలిక కాకపోవచ్చు.
ఈ సందర్భంగా సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, అందుకు ప్రస్తుత కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నుండి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఎస్సి, ఎస్టీ నియోజకవర్గాలపై పార్టీ దృష్టి పెడుతున్నందున ఆదివాసీ నేత అయినా ఎంపీ సాయం బాబురావును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు.