తెలంగాణ బీజేపీలో లొల్లిపై అమిత్ షా చివాట్లు!

Wednesday, January 22, 2025

తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు అర్ధాంతరంగా మంగళవారం నడ్డా ఇంట్లో సమావేశం జరపడం ఆంతర్యం బైటకు తెలపడం లేదు. పైగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రీట్ కార్నర్ సమావేశాల ముగింపు రోజు సందర్భంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో బహిరంగసభలు పెట్టాలని, వాటిల్లో రాష్ట్ర నేతలు అందరూ పాల్గొనాలని కార్యక్రమాలు రూపొందించుకున్న సమయంలో ఈ భేటీ జరగడం విస్మయం కలిగిస్తోంది.

మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశం అనంతరం రాష్ట్ర నాయకులు ఎవ్వరూ లోపల ఏమిజరిగిందో మీడియాకు చెప్పక పోవడం గమనార్హం. అది అత్యవసర సమావేశం ఏం కాదని, రొటీన్ మీటింగ్ అని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నమ్మించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లటమే తమ లక్ష్యమని ఆ విషయాలనే సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు.

అయితే, తెలంగాణాలో బిజెపి నాయకుల పనితీరుపట్ల అమిత్ షా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తున్నది. నాయకుల మధ్య గ్రూపు రాజకీయాల పట్ల అగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.  ఈటెల రాజేందర్ చైర్మన్ గా ఉన్న చేరికల కమిటీ కొత్తవారెవ్వరిని పార్టీలోకి తీసుకు రావడం లేదని బండి సంజయ్ ఫిర్యాదు చేయగా, సంజయ్ ను చూసి ఎవ్వరు పార్టీలోకి రావడం లేదని రాజేందర్ ఘాటుగా సమాధానం ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ వ్యక్తిగతంగా పలువురు నాయకులతో, పార్టీకి సంబంధం లేని వారితో కూడా భేటీలు జరిపి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ భేటీ జరిగినట్లు చెబుతున్నారు.

ఇటీవల ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన రెండు సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలను తెలంగాణ బిజెపి నేతల ముందు ఉంచి ఆయన సమీక్షించారు. తెలంగాణలో పార్టీ పనితీరుపై ఎప్పటికప్పడు నివేదికలు అందుతున్నాయని ఆయన తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ దూసుకుపోతుంటే, రాష్ట్ర బిజెపిలో అలాంటి వాతావరణం లేదనే విషయాన్ని అధిష్టానం గుర్తించిందని స్పష్టం చేశారు.
ముందుస్తు ఎన్నికలు వస్తే అందుకు సిద్ధంగా ఉన్నారా? అని నిలదీశారు.

ముఖ్యంగా బండి సంజయ్ వ్యవహారంపట్ల సీనియర్ నాయకులు అందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎంతసేపు ప్రతిరోజూ మీడియాలో తన గురించి ప్రచారంకోసం ఆరాటపడటమే గాని సంస్థాగతంగా పార్టీ వ్యవహారాల గురించి పట్టించుకోవడం లేదని, అందరిని కలుపుకుపోయే ప్రయత్నం చేయడం లేదని పెద్దఎత్తున ఫిర్యాదులు వెళ్లాయని చెబుతున్నారు.

మిగిలిన నాయకులు కూడా పై పై తిరుగుతూ హడావిడి చేయడం మినహా క్షేత్రస్థాయిలో ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే ప్రయత్నాలు చేయడం లేదని గ్రహించారు. ప్రతి పోలింగ్ బూత్ లో కమిటీలు ఏర్పాటు చేసి, వాటిని క్రియాశీలం చేయమని ఆదేశించినా ఓటర్ల జాబితాలు చూసి కమిటీలు వేసి సరిపెట్టుకొంటున్నట్లు కనుగొన్నారు. అటువంటి కమిటీలు సహితం సగంకు పైగా బూత్ లకు ఇంకా వేయలేదు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అన్ని పోలింగ్ బూత్ లలో ఏజెంట్లను పెట్టుకోగల అభ్యర్థులు పట్టుమని పదిమంది కూడా లేరని భావిస్తున్నారు. తెలంగాణాలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తుంటే రాష్ట్ర నాయకత్వంలో అందుకు తగిన సమర్ధత కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను కొందరు నేతలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని బిజెపి నేతలను అమిత్ షా ప్రశ్నించినట్లు తెలిసింది. అనుకున్న గడువులోపు కార్నర్ మీటింగ్‌లు ఎందుకు పూర్తి చేయలేదని, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాల్లో అనుకున్నస్థాయిలో ఈ మీటింగ్‌లు పూర్తి చేయడటంలో ఎందుకు విఫలమయ్యారని నిలదీసినట్లు సమాచారం.

ప్రజా సమస్యలపై మీడియా సమావేశాలలో ప్రస్తావించడం మినహా క్షేత్ర స్థాయిలో పోరాటాలు జరిపి, ప్రజలను సమీకరించే ప్రయత్నం చేయడం లేదని కూడా కేంద్ర నాయకత్వం గ్రహించింది. పైగా, బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలను సహితం తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. కొందరు ముఖ్య నాయకులు లోపాయికారిగా బిఆర్ఎస్ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు సహితం పసిగట్టినట్టు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles