కర్ణాటకలో మరోసారి విజయం సాధించగానే ఇక ఫోకస్ అంతా తెలంగాణపై పెడతామని, ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతూ వస్తున్న బిజెపి కేంద్ర నాయకత్వానికి కర్ణాటక ఫలితాలు మింగుడు పడటం లేదు. అంతలో తెలంగాణ బీజేపీలో నివురుగప్పిన కుమ్ములాటలు ఒకేసారి పడగవిప్పడంతో ఏమి చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఒక వంక, రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం అసంభవమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వంటి నేతలు నేరుగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు స్పష్టం చేస్తుండగా, మరోవంక బీజేపీలో చేరిన నేతలందరూ తిరిగి వచ్చేయమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి `ఘర్ వాపస్’ నినాదం తీసుకోవడంతో కంగుతింటున్నారు.
కర్ణాటక ఎన్నికలు కాగానే బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు క్యూ కడతారని వేసుకున్న అంచనాలు తలకిందులవుతాయి. పైగా, పార్టీనుండి ఎవ్వరు ఎటు వెడతారో తెలియక తికమక పడుతున్నారు. బిఆర్ఎస్, బిజెపిని ఒకటిగానే ప్రజలు చూస్తున్నారని, ఢిల్లీలో దోస్తి.. గల్లీలో కుస్తీ అన్నట్లుగా బిజెపితో బిఆర్‌ఎస్ ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీ నుండే పార్టీ నాయకత్వంపై దాడికి దిగారు.
పైగా, మద్యం కుంభకోణంలో ఎన్నెన్నో ఆధారాలు ఉన్నాయని చెబుతున్నా బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడంతోనే పంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు బీజేపీలో చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నాయకత్వాన్ని మార్చాలని ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్, ఇతర నేతలు డిమాండ్ చేయడంతో బండి సంజయ్‌పై తెలంగాణ బిజెపిలో అసమ్మతి రచ్చకెక్కుతున్నది. బండి సంజయ్ విధానాలు ప్రజల మద్దతు పొందడంలో విఫలమవుతున్నాయని ఈ నేతలు వాదిస్తున్నారు.బండి సంజయ్ ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ప్రసంగించినా కేవలం హిందుత్వ అంశం మాత్రమే తీసుకురావడంతో ఇతరులు బీజేపీకి దూరమవుతున్నారని ఈటెల అమిత్ షాకు తేల్చి చెప్పారు. కర్నాటకలో హిందుత్వ మోడల్ పనిచేయలేదని, ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను మార్చి అనువైన నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని ఈటల సూచించారట.
తెలంగాణలో మతపరమైన రాజకీయాలు పనిచేయవన్న అభిప్రాయంతో ఈటల రాజేంద్ర ఉన్నారు.అదే జరిగితే కర్నాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయన్న విషయాన్ని గ్రహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమలదళంలో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఇది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది.
మరోవంక, నన్ను ఢిల్లీ నుండి ఎవ్వరూ పిలవలేదని, తాను ఢిల్లీ వెళ్లడంలేదని మీడియా ముందు చెప్పిన బండి సంజయ్ హడావుడిగా శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. ఆరోగ్యపరీక్షల కోసం అని ఆయన మద్దతుదారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నా కేంద్ర నాయకత్వం నుండి పిలుపు మేరకే వెళ్లినట్లు తెలుస్తున్నది.
ఇతర పార్టీల నుండి వలసవచ్చిన నేతలందరూ బండి సంజయ్ పై కేంద్ర నాయకత్వం వద్దనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతుండగా, సంజయ్ ధోరణితో అసంతృప్తిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డా. లక్ష్మణ్ వంటి నేతలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఎటువంటి మార్పు జరిగినా తమకు ప్రాధాన్యత పెరుగుతుందిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.