తెలంగాణ బీజేపీలో మరోసారి కోవర్ట్ గోల!

Saturday, November 16, 2024

గత ఏడాది హుజురాబాద్ ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన శక్తిసామర్ధ్యాలు అన్నింటిని మోహరింపచేసినా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, తిరుగులేని ఆధిక్యతతో గెలుపొందడంతో అప్పటి నుండి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణాలో తమదే అధికారం అనే ధోరణి ఆ పార్టీలో పెరుగుతూ వచ్చింది.

అయితే, అందుకు అవసరమైన నాయకత్వం, వ్యూహాలు లోపించిన ఆ పార్టీ అధికారం వచ్చిందే అనుకొంటూ పదవుల కోసం కొట్లాటలో మునిగిపోయారు.  ఈ సందర్భంగా బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని అంటూ గత ఏడాది ఈటెల చేసిన ప్రకటన ఆ పార్టీలో కలకలం రేపింది.

వెంటనే `మా పార్టీలో అటువంటివారెవ్వరు’ లేరు అంటూ రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కస్సుమంటూ లేచారు. కోవర్టులున్నారని ఎవరైనా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ కూడా చేశారు.

తాజాగా,  బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్న మాట నిజమేనని పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తిరిగి ఘాటైన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా, కోవర్టుల పేర్లను అధిష్ఠానానికి అందించానని వెల్లడించారు. వారి తీరు మారకపోతే మీడియా సాక్షిగా అందరి పేర్లు బయట పెడతానని నందీశ్వర్ గౌడ్ హెచ్చరించారు.

పైగా, మరో 15 రోజుల్లో తన సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించడంతో బిజెపిని వదిలి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారని కధనాలు వెలువడుతున్నాయి. అయితే తాను బిజెపిని వీడటం లేదని తర్వాత ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, తాను బండి సంజయ్, ఈటెల రాజేందర్ వర్గం కాదన్న నందీశ్వర్ గౌడ్  వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంటే బీజేపీలో వర్గపోరు ఎంత తీవ్రంగా ఉందొ చెప్పకనే చెప్పినట్లయింది.

అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టులున్నారని అప్పట్లో చెప్పిన ఈటల రాజేందర్ వారి వల్లే కేసీఆర్ పార్టీలను దెబ్బతీస్తున్నారని తెలిపారు. ఇన్ ఫార్మర్లు తమ వ్యూహాలను కేసీఆర్‌కు చేరవేరుస్తున్నారని ఆరోపించారు. లీకుల కారణంగా నేతలు బీజేపీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారని కూడా చెప్పారు.

అప్పుడే బండి సంజయ్ తొందరపడి ఈటెల మాటలను ఖండించకుండా అంత సీనియర్ నేత అన్నారంటే కొంతైనా నిజం ఉండు ఉంటుందని జాగ్రత్తపడి  ఉంటె ఇప్పుడు తెలంగాణాలో బిజెపికి ఇటువంటి దుస్థితి ఏర్పడేది కాదని పరిశీలకులు భావిస్తున్నారు. అప్పట్లో ఈటెల తన ఆరోపణల గురించి పార్టీ ఢిల్లీ పెద్దలకు పూర్తి వివరాలు అందించారు. అయినా వారు కూడా పట్టించుకోలేదు.

ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బిజెపి అభ్యర్థికోసం వెడుతున్న డబ్బును పెద్ద ఎత్తున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుంటే పట్టుకున్న డబ్బు కాదది. ఏ కారులో, ఎవ్వరు, ఎంత డబ్బు తీసుకు వస్తున్నారో అనే ముందస్తు సమాచారం ఉండడంతో కేవలం ఆ కారునే ఆపి, డబ్బును స్వాధీనం చేసుకోవడం పలు చోట్ల జరిగింది.

అంత ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందుతున్నదంటే బీజేపీలో కేసీఆర్ కు కోవర్టులుగా పనిచేస్తున్న సీనియర్ నాయకుల నుండే వెళ్లి ఉంటుందని ఈటెల భావించారు. దానితో అటువంటి నాయకులు బండి సంజయ్ తో సన్నిహితంగా ఉంటూ ఉండడంతో, దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్టు వ్యవహరించిన్నట్లు స్పష్టం అవుతుంది.

అంతేకాకుండా, బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ కొందరి పేర్లు పార్టీ నేతలకు ఈటెల అందిస్తే, రెండు, మూడు రోజులలో కేసీఆర్ వారందరిని సరిచేసుకొని పార్టీ మారకుండా చేశారు. అంటే, ఈటెల ఇచ్చిన జాబితా కేసీఆర్ వద్దకు వెళ్లినట్టు గ్రహించారు. బీజేపీ రాష్త్ర కార్యాలయంలో ఐటి సెల్, ఇతర విభాగాలలో పనిచేస్తున్న వారిలో కూడా అటువంటి కోవర్టులు ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పుడు తాజాగా, నందీశ్వర్ గౌడ్ సహితం కోవర్టులు విషయం ప్రస్తావించడంతో తెలంగాణాలో ఆ పార్టీ సంస్థాగతంగా ఎంత బలహీనంగా ఉందొ వెల్లడి అవుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles