తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న కర్ణాటక ఫలితాలు

Wednesday, December 18, 2024

కర్ణాటకలో బీజేపీ  అధికారాన్ని కోల్పోవడంతో మరో ఆరు నెలల్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావాలని బిజెపి పెట్టుకున్న ఆశలపైనీరు చల్లినట్లయింది.  పార్టీలో కొత్తగా ఎవ్వరూ చేరేవారు లేకపోగా ఉన్నవారిలో ఎవ్వరు మిగులుతారో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ముఖ్యంగా బిజెపి – బిఆర్ఎస్ లమధ్య రహస్య ఒప్పందం ఉందని కొందరు ప్రముఖ బిజెపి నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్న దృష్ట్యా ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది.  కనీసం ఇద్దరు మాజీ ఎంపీలు బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరేందుకు ఢిల్లీ స్థాయిలో బేరసారాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో తమకు సీట్లు ఇస్తామని భరోసా ఇస్తే చేరుతామని అంటున్నారు.

తమకు ఎంపీ సీట్లు ఇవ్వకపోయినా తమ వారసులకు ఎమ్యెల్యే సీట్లు ఇవ్వమని అడుగుతున్నారు. అయితే వెంటనే అటువంటి హామీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్దపడక పోవడంతో వారికి దిక్కుతోచడం లేదు.  కర్ణాటక ఫలితాలు రాగానే మాజీ మంత్రి, ఎమ్యెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానం వద్ద తెలంగాణాలో పార్టీ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారశైలిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిని మార్చకుండా అసెంబ్లీ ఎన్నికలకు వెడితే పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంటుందని, గతంలో వచ్చిన ఓట్లు కూడా రావని హెచ్చరించారని చెబుతున్నారు.

మరోవంక, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నిఘా వర్గాల నుండి తెప్పించుకున్న క్షేత్రస్థాయి నివేదికలు సహితం ఆందోళనకరంగా ఉన్నట్లు తేలుతున్నది.  అందుకనే, వారం- పది రోజులలో తెలంగాణాలో బిజెపి పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని చెబుతున్నారు.

సీనియర్ నేతలను కలుపుకు పొమ్మనమని బండి సంజయ్ కు పలు సార్లు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో నాయకుల మధ్య స్పష్టంగా పనుల విభజన చేయాలనీ తలపెట్టినట్లు తెలుస్తున్నది.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని కొండా విశ్వేశ్వరెడ్డి ఢిల్లీ నుండే చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీపై ఇప్పటికీ తనకు అభిమానం ఉందని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది.  ఇప్పుడు పార్టీలోకి చేరికలు కష్టం.. బీజేపీ పుంజుకోవటం కష్టమేనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్  తేల్చి చెప్పారు.

 కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పోలిస్తే.. తాము మూడోస్థానంలో ఉన్నామని మాజీ ఎమ్యెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తాజాగాచెప్పారు. తాము ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఉన్నామని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదని తెలిపారు. మొత్తానికి పార్టీ సీనియర్ నేతల కామెంట్స్‌తో క్యాడర్‌లో అయోమయం నెలకొంది. అసలు పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కావటం లేదని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు.

కర్ణాటక ఫలితాలతో తెలంగాణాలో బిజెపి పరిస్థితి అగమ్యగోచరంగా ఏర్పడడంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు, పార్టీ నేతలతో సమాలోచనలు జరిపి అవసరమైన వ్యూహాలను రూపొందించుకొని ప్రయత్నాలు చేయకుండా బిజెపికి వ్యతిరేకంగా ఒక వర్గం మీడియా కుట్రతో ఇటువంటి వార్తలను వ్యాప్తి చేస్తుందని అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles