తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలపై జెపి నడ్డా ఆగ్రహం

Saturday, January 18, 2025

తెలంగాణ  బీజేపీ నేతల మధ్య కుమ్ములాటలు ఎక్కువ కావడం, నాయకులు పరస్పరం బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం, రచ్చకెక్కడం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది జోన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్ ఛార్జ్ ల సమావేశంకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఆదివారం రాత్రి తెలంగాణ బిజెపి నేతలతో ఓ హోటల్ లో ప్రత్యేక సమావేశం జరిపారు.

నాయకులంతా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరస్పర ఆరోపణలతో పార్టీకి నష్టం కలిగించవద్దని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ అలాంటివి సహించబోమని తీవ్రస్థాయిలోనే హెచ్చరించారు.

 గతంలో ఎన్నడూ లేనంతగా.. బీజేపీ అంతర్గత అంశాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారడం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. అంతర్గత కుమ్ములాటలు కారణంగా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినా, ఇంకా అదుపులోకి రాకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.

బీజేపీలో నేతల మధ్య వర్గపోరు ఎక్కువైందని, మీడియాలో కూడా దీని గురించి వార్తలు రావడం సరైన పరిణామం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తే సహించేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని నడ్డా హెచ్చరించారు. పార్టీకి నష్టాన్ని కలిగించే విధంగా అనవసర వ్యాఖ్యలు చేయవద్దని హితవు చెప్పారు. 

అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. పార్టీ అగ్రనేతల పర్యటనలు క్రమం తప్పకుండా ఉంటాయని, అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇన్‌ఛార్జులు పూర్తిగా అందుబాటులో ఉంటూ పార్టీ వ్యవహారాలు సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు.

పార్టీ పదవుల కేటాయింపు విషయంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డాతో పలువురు ముఖ్యనేతలు ఒక్కొక్కరు విడివిడిగా సమావేశం అయ్యారు. ఈటల రాజేందర్‌, ఎంపీ డి.అర్వింద్‌, మాజీ ఎంపీలు జి.వివేక్‌, విజయశాంతి, జాతీయ కార్యవర్గసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు నడ్డాతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని, అన్ని వివాదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలని వారందరికీ నడ్డా సూచించినట్లు తెలుస్తోంది.
మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు ఉండటం, ఈ ఏడాదిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయలంలో జరిగిన ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు.

ఉత్తరాది రాస్త్రాలలో ఇప్పటికే గరిష్టంగా సీట్లను గెల్చుకున్న బీజేపీ బలం తగ్గే అవకాశం ఉన్నందున ఈ రాస్త్రాలలో అత్యధికంగా సీట్లు గెల్చుకొనేందుకు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాస్త్రాలలో గత ఎన్నికలలో కర్ణాటకలో 24, తెలంగాణాలో 4 సీట్లు మాత్రమే గెల్చుకున్నారు. ఈ సంఖ్యను గణనీయంగా పెంచాలని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles