తెలంగాణ బీజేపీలో  ఏకాకిగా మిగిలిన బండి సంజయ్!

Thursday, December 19, 2024

మున్సిపల్ కార్పొరేటర్ స్థాయి నుండి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి స్థాయి వరకు ఎదిగిన బండి సంజయ్ మూడేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకున్న రోజుననే బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితపై చేసిన వాఖ్యాలను ఆసరా చేసుకొని ఆ పార్టీ శ్రేణులు ఆయనపై ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. ఓ మహిళా పట్ల ఆ విధంగా అనుచితంగా మాట్లాడతావా అంటూ నిరసనలు చేపట్టారు. ఎక్కడికక్కడ ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

రాష్ట్ర మహిళా కమీషన్ సుమోటోగా ఈ అంశం చేపట్టింది. జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ లలో ఆయనపై ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల ఆయనపై ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. అయినా సంజయ్ కు మద్దతుగా రాష్ట్రంలో పార్టీ నాయకత్వం ముందుకు రాకపోవడం విస్మయం కలిగిస్తున్నది. మూడేళ్ళుగా అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు కారణంగా పార్టీలో ఏకాకిగా మిగిలిపోయారని వెల్లడైంది.

ఇదే సమయంలో హైదరాబాద్ కు వచ్చిన పార్టీ అగ్రనేత అమిత్ షా ఈ విషయమై సున్నితంగా సంజయ్ ను మందలించినట్లు తెలుస్తున్నది. మాట్లాడు జాగ్రత్తగా రావాలని, పార్టీకి నష్టం కలిగించకూడదనే హితవు చెప్పారు. మరోవంక, పార్టీలో అందరిని కలుపుకు పోవాలని హితవు చెప్పడం ద్వారా ఒంటెత్తుపోకడలను అనుసరిస్తున్నావంటూ పరోక్షంగా హెచ్చరించినట్లయింది.

ఒకరిద్దరు మహిళా నేతలు మాత్రమే సంజయ్ అన్నదానిలో తప్పులేదంటూ ప్రకటనలు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ సంజయ్ మాటలను వక్రీకరించారని తప్పుబట్టారు. అంతేగాని, రాష్ట్రం నుండి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న జి కిషన్ రెడ్డి గాని, ఆయన సహచర ఎంపీలు గాని, డా. కె లక్ష్మణ్, ఈటెల రాజేంద్ర వంటి సీనియర్ నేతలు గాని “మా రాష్ట్ర అధ్యక్షుడి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారా?” అంటూ కనీసం ఆగ్రహం వ్యక్తం చేయలేదు.

సంజయ్ కు మద్దతుగా బీజేపీకి శ్రేణులు రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఆయన ఎంపీగా ఉన్న కరీంనగర్ లో కూడా స్పందన కనిపించలేదు. నిత్యం మీడియాలో కనిపించేందుకు కేసీఆర్, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలకు దిగే ఆయన ఆ రోజంతా దాదాపు మౌనంగా కనిపించారు.

ఇట్లా ఉండగా, ఆయన కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు స‌రైన‌వి కాదంటూ సహచర ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొనడం పార్టీలో అంతర్గత విబేధాలను రచ్చకెక్కించినట్లయింది. బిజెపి వంటి పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిని తప్పుబడుతూ మీడియాలో ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తం మాట్లాడటం చాలా అరుదు.

పైగా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో ఉన్న సమయంలోనే ఆయన ఈ విధంగా సంజయ్ ను తప్పుబడుతూ ఢిల్లీలో మాట్లాడటం పార్టీ వర్గాలలోని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వ్యాఖ్యల‌ను తాను సమర్థించడం లేదని చెబుతూ బండి సంజ‌య్‌ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటే మంచిద‌ని హిత‌వు కూడా చెప్పారు.

ఏ సంద‌ర్భంలోనైనా సామెతలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించాలని అంటూ ఒక విధంగా హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. లేకుంటే అభాసుపాలు కావాల్సి వ‌స్తుంద‌ని స్పష్టం చేశారురు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా అనేది పవర్‌ సెంటర్‌ కాదని.. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అని ఈ సందర్భంగా అరవింద్ గుర్తు చేయడం గమనిస్తే బీజేపీలో అంతర్గతంగా బిజెపికి వ్యతిరేకంగా ఏదో గూడుపుఠాణి జరుగుతున్నట్లు వెల్లడి అవుతుంది. 

సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చనిదే తెలంగాణాలో పార్టీ ముందుకు వెళ్లడం కష్టం అని, పార్టీలో కొత్తగా ఎవ్వరూ చేరబోరని అంటూ అరవింద్ ఢిల్లీలో పార్టీ కీలకనేతలు అందరికి వాట్స్ అప్ సందేశాలు పంపిన్నట్లు తెలుస్తున్నది.

పార్టీ అధిష్టానం సహితం సంజయ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నదనే సంకేతాలు లేకుండా అరవింద్ వంటి వారు ఈ విధంగా మాట్లాడే అవకాశం ఉండదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. గత నెలలో సహితం పిజి మెడికో డా. ప్రీతీ ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఎక్కడో పర్యటనలో ఉన్న సంజయ్ వెంటనే “లవ్ జిహాద్” బాధితురాలు అంటూ ప్రకటన ఇచ్చారు. కానీ బీజేపీ నేతలు ఎవ్వరు ఈ విషయంలో సహితం సంజయ్ మాటలకు ఆమోదం తెలపలేదు. దానితో ఆ తర్వాత సంజయ్ ఆ మాట వాడటం మానివేశారు.

బండి సంజయ్ తీరు పట్ల కొందరు కీలక నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యనేతలను  అమిత్ షా ఇటీవల ఢిల్లీకి పిలిపించి, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అయినా, రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాల పూర్తిగా సద్దుమణగలేదనే అభిప్రాయాలు ఇప్పుడు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles