తెలంగాణ బిజెపి ఎంపీలలో మంత్రి పదవులకై క్యూ!

Saturday, January 18, 2025

అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల నుండి ఎన్నికలకు ముందుగా కొత్తవారిని కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవడం బీజేపీలో పరిపాటిగా జరుగుతున్నది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, పైగా అవి నాలుగైదు నెలల ముందుగానే జరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తూ ఉండడంతో తెలంగాణలోని బీజేపీ ఎంపీలలో మంత్రి పదవిపై ఆశలు చిగురిస్తున్నాయి.

అదీగాక, ఈ సారి ఎలాగైనా తెలంగాణాలో అధికారంలోకి రావాలని బిజెపి కేంద్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. ఆ దిశలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ నుండి నలుగురు లోక్ సభ సభ్యులతో పాటి, ఇటీవలనే డా. కె లక్ష్మణ్ ను  రాజ్యసభకు పంపారు. ప్రస్తుతం జి కిషన్ రెడ్డి కేంద్రంలో క్యాబినెట్ హోదాలో ఉండగా, మరో ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.

గత నాలుగైదు రోజులలో డా. లక్ష్మణ్, డి అరవింద్ వరుసగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం గమనార్హం. ఆ తర్వాత హోమ్ మంత్రి అమిత్ షా తో కూడా సమావేశమయ్యారు. తెలంగాణా రాజకీయాల గురించి మాట్లాడమని చెబుతున్నప్పటికీ వారిద్దరి ఉద్దేశ్యం మంత్రి పదవి సంపాదించడమే అని తెలుస్తున్నది.

అయితే, డా. లక్ష్మణ్ ఇప్పటికే పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా, ఓబిసి విభాగం జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మంత్రి పదవి ఏమేరకు లభిస్తుందో అన్నది అనుమానమే. కాగా, లక్ష్మణ్, బండి సంజయ్, అరవింద్ … ముగ్గురు ఒకే సామాజిక వర్గంకు చెందిన వారు. వారికి ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యత పార్టీలో ఇస్తున్నారనే అభిప్రాయం ఉంది.

పార్టీలో సీనియర్లను కలుపుకు వెళ్లలేక పోతున్నారని, పార్టీ శ్రేణులలో ఉత్తేజం తీసుకు వస్తున్నా పార్టీ పరిధిని విస్తరింపలేక పోతున్నారని బండి సంజయ్ పై అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఎన్నికల సమయంకు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి, ఈటెల రాజేందర్ ను అధ్యక్షునిగా చేయాలనే ప్రతిపాదన ఒకటి కేంద్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

అదే జరిగితే, సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. మరోవంక, ఉన్న అందరి ఎంపీలలో క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం గల ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ సాయం బాబురావు మాత్రమే కావడం, పైగా గిరిజనుడు కావడంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన కూడా పార్టీ వర్గాలలో సాగుతున్నది.

తెలంగాణలోని అన్ని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, అసెంబ్లీ ఎన్నికలలో వాటిల్లో అత్యధికంగా గెలుపొందాలని బిజెపి జాతీయ నాయకత్వం రెండేళ్ల క్రితమే రోడ్ మ్యాప్ రాష్ట్ర పార్టీ ముందుంచింది. అయితే దానిని అమలు పరచడం పట్ల సంజయ్ ఆసక్తి చూపలేదని విమర్శలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో అత్యధికంగా ఏ పార్టీ గెలుపొందితే, ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తెలంగాణాలో చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది.

బాబురావును మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్లనా ఈ నియోజకవర్గాలలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం కూడా ఉంది. మరోవంక, డి అరవింద్ కూడా తనకున్న విశేషమైన వనరులు, పరిచయాలను ఆసరా చేసుకొని మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇలా ఉండగా, బిజెపి జాతీయ అధ్యక్షులుగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ సహితం రాజ్యసభ సభ్యత్వంతో మంత్రి పదవి కోసం చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే అదే సామాజిక వర్గం నుండి కిషన్ రెడ్డి మంత్రివర్గంలో ఉండడంతో ఆమెకు అవకాశాలు లేవని స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles