కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని ఓడించి అధికారాన్ని తమ పార్టీ హస్తగతం చేసుకున్న విధంగానే.. తెలంగాణలో కూడా భారాసను ఓడించి అధికారంలోకి వస్తామని పార్టీ అధినేత రాహుల్ గాంధీ న్యూయార్క్ లో ప్రకటించారు. ఈ ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులలో ఎంత ఉత్సాహం నింపిందో తెలియదు గానీ.. ఇద్దరు నాయకులు తమ పార్టీలో చేరబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం చూసి కాంగ్రెస్ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నట్లుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను నమ్మించడానికి ఆ ఇద్దరి చేరిక ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అభిమానులు భావిస్తున్నారు. ఆ ఇద్దరు నాయకులు మరెవ్వరో కాదు. ఒకరు ఖమ్మం జిల్లా రాజకీయాలను మొత్తం తాను శాసించగలను అని భావించే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరొకరు మాజీ మంత్రి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు.
మొన్న మొన్నటి దాకా భారాసలో ఉంటూ వచ్చిన ఈ ఇద్దరు నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను సస్పెన్షన్ కు గురయ్యారు. కెసిఆర్ ను గద్దె దించడమే తన జీవితాశయం అన్నట్లుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక ఆత్మీయ సభలు నిర్వహిస్తూ వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులకు విందులు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. సస్పెన్షన్ కు గురైన మరో నాయకుడు జూపల్లి కృష్ణారావు, పూర్తిగా పొంగులేటితో జతకట్టి ఆయన వెంట ఉండి రాజకీయం చేస్తున్నారు.
ఈ ఇద్దరు అంతో ఇంతో బలమైన నాయకులు కావడం వలన భారతీయ జనతా పార్టీ కూడా వీరిని చేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసింది. చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ తో పాటు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు వీరితో రెండు దఫాలుగా భేటీ అయ్యారు. “కెసిఆర్ ను కచ్చితంగా ఓడించగలం అనడానికి మీ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి?” అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపి నాయకులకే ఎదురు ప్రశ్నలు సంధించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ నాయకులు చెప్పిన సమాధానాలతో ఆయన సంతృప్తి పడలేదని కూడా వార్తలు వచ్చాయి. వారిని ఒప్పించి పార్టీలోకి తీసుకురాగలిగే విషయంలో ఈటల కూడా చేతులెత్తేశారు.
ఈ నేపథ్యంలో వారు కాంగ్రెసులో చేరాలనే నిర్ణయానికి రావడం ఆ పార్టీకి సానుకూల అంశమని చెప్పాలి. ఒకవైపు రాజస్థాన్లో సచిన్ పైలెట్ తిరుగుబాటుతో చికాకులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలంగాణ పరిణామాలు శుభశకునాలు గానే కనిపించడంలో సందేహం లేదు.