తెలంగాణ ఎన్నికలకు ముందు బీజేపీ ‘రజాకార్ ఫైల్స్’

Wednesday, January 22, 2025

తెలంగాణాలో మొన్నటి వరకు రాజకీయంగా హల్ చల్ చేసిన బీజేపీ కర్ణాటక ఎన్నికల అనంతరం కొంత క్రజ్ తగ్గిన్నట్లు గమనించినా, వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా తమ ప్రాబల్యం చాటుకోవాలని పట్టుదలతో సరికొత్త ఎత్తుగడలకు సిద్ధమవుతున్నది. ఒక వంక ఎస్సి, ఎస్టీ నియోజక వర్గాలపై దృష్టి సారిస్తూ, ఇతర రాష్ట్రాల నుండి ఆయా సామాజిక వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులను రప్పించి ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.

తెలంగాణ ప్రజలలో ఒక సంచలనం కలిగించడం ద్వారా వారి దృష్టిని ఆకట్టుకొనేటట్లు చేయడం కోసం `రజాకార్ ఫైల్స్’ సినిమా అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నది. గతంలో `కాశ్మీర్ ఫైల్స్’, `కేరళ స్టోరీ’ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో రాజకీయంగా కలకలం సృష్టించిన బిజెపి ఇప్పుడు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.

‘రజాకార్ – ద సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ సినిమా పోస్టర్ని శనివారం  హైదరాబాద్ లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి. విద్యాసాగర్ రావు, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతల సమక్షంలో ఆవిష్కరించారు.  ఈ సినిమాకు యాట సత్యనారాయణ రచన, దర్శకత్వం వహించారు. 

ఈ   సినిమాను ‘సమర్‌వీర్‌ క్రియేషన్స్‌’ బ్యానర్‌పై బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి  నిర్మించారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది.  ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ  ఈ సినిమా మత ఘర్షణల చరిత్ర కాదని స్పష్టం చేశారు. ఇది ఎవరిలో అసంతృప్తిని కలిగించడానికి రూపొందించబడింది కాదని తెలిపారు.  షేక్ బందగి, మక్దూమ్ మొయినుద్దీన్, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ వంటి ముఖ్యమైన ముస్లిం వ్యక్తుల పేర్లను ఈ సినిమాలో ప్రస్తావించినట్టు సమాచారం.

మ‌న చ‌రిత్రలో చాలా విష‌యాల‌ను బ‌య‌ట‌కు తెలియ‌నీయ‌కుండా చేశారని అంటూ “ఇప్పుడా విష‌యాలు గురించి నేను మాట్లాడ‌ను. తెలంగాణవాదిగా నేను నా హ‌క్కుగా, భారతీయుడిగా భావించి రజాకార్ అనే సినిమా చేశాను. అంతే త‌ప్ప‌..నేను ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌టానికి ఈ సినిమా చేయ‌లేదు’’ అని నిర్మాత గూడూరు నారాయణరెడ్డి వివరించారు.

సినిమా నిర్మాతలను బండి సంజయ్ అభినందించారు. ఆ తర్వాత ‘పాత బస్తీ ఫైల్స్’ (ఓల్డ్ సిటీ) తీయాలని నిర్మాతను కోరుతున్నట్టు చెప్పారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా నుండి ప్రేరణ పొందిన తర్వాత దర్శక-నిర్మాత ద్వయం రజాకార్లపై సినిమాని రూపొందించినట్టు తెలుస్తోంది. 

తెలంగాణలో అనేక దురాగతాలకు నిజాంలే కారణమని చిత్ర నిర్మాతలు పేర్కొంటుండగా, బండి సంజయ్ మాత్రం “కొందరు చార్మినార్, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చూపించి నిజాం-రజాకార్ల పాలనను స్వర్ణ కాలంగా పేర్కొంటున్నారని మండిపడ్డారు.

హీరోయిన్ వేదిక మాట్లాడుతూ ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని నెలల తర్వాత హైదరాబాద్‌కి స్వాతంత్య్రం వ‌చ్చింద‌ని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాను. అలాంటి చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ర‌జాకార్ సినిమాను అంద‌రూ ఆద‌రించాలి. ఈ సినిమా చేయ‌టం గౌర‌వంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles