తెలంగాణ అభివృద్ధిని తన అభివృద్ధిగా చెప్పుకున్న మోదీ

Sunday, December 22, 2024

వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తమదే అధికారం అంటూ చెప్పుకుంటూ వస్తున్న సమయంలో అంతర్గత కుమ్ములాటలతో బిజెపి చతికలపడిన సమయంలో వరంగల్ లో అధికారిక కార్యక్రమంకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ దానిని ఎన్నికల ప్రచారసభగా మార్చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లను ఓడించి బిజెపిని గెలిపించాలంటూ పిలుపిచ్చారు.

అంతవరకు బాగానే ఉంది గాని… మొదటిసారిగా వరంగల్ కు వచ్చిన ఆయన తెలంగాణ అభివృద్ధి కోసం కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ గాని, పధకం గాని ప్రకటిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. లేదా గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన భారీ పథకం దేనిగురించైనా చెబుతారు అనుకొంటే అది లేదు. పైగా, తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అంతా తన ఘనతగా చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చొరవ కావచ్చు, ఇస్తున్న ప్రోత్సాహాలు కావచ్చు, భౌగోలికంగా అనుకూలమైన ప్రదేశం కావడం కావచ్చు ఇటీవల కాలంలో తెలంగాణకు విశేషంగా పెట్టుబడులు వస్తున్నాయి. దేశ విదేశాల నుండి పలువురు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. తెలంగాణకు ఉద్దేశించిన పలు ప్రాజెక్టులను మోదీ ప్రభుత్వం గుజరాత్ కు తరలించినా, పలు రంగాలలో మరే రాష్ట్రంలో కానరాని అభివృద్ధిని తెలంగాణ చూస్తున్నది.

అందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని కాకపోయినా కనీసం ఈ ప్రాంత ప్రజలను ప్రధాని అభినందించి ఉంటె హుందాగా ఉండెడిది. ఆ విధంగా కాకూండా తన పాలనలో అంతర్జాతీయంగా భారత దేశం ఇమేజ్ పెరుగుతూ ఉండడంతో తెలంగాణకు పెట్టుబడుల వరద జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అదే నిజమైతే పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేస్తున్నా అసలు పెట్టుబడులు ఏవీ రావడం లేదే?

నిన్నటి వరకు బీజేపీ ప్రభుత్వం ఉన్న కర్ణాటకకు మించి హైదరాబాద్ కు ఐటి వంటి రంగాలలో పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయే? . గుజరాత్‌కు రూ. 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని, రూ. 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ కు ఇప్పుడు శంకుస్థాపన చేసి అదేదో ఘనకార్యంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతో కాలంగా, తెలంగాణ ప్రజలు అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా ఒక విధంగా దానికి సమాధి వేసే ప్రయత్నం చేసిన్నట్లయిందని విమర్శలు చెలరేగుతున్నాయి. 

తెలంగాణ వర్సిటీల్లో మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదని,   రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ప్రధాని  దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల ఖాళీలను ముందుగా భర్తీ చేయాలని మంత్రి కేటీఆర్ నిలదీశారు. యూనివర్సిటీలలో ఖాళీల భర్తీ కోసం తెలంగాణప్రభుత్వ రూపొందించిన చట్టాన్ని, బీజేపీ నాయకురాలు, ప్రస్తుత గవర్నర్ తమిళసై తొక్కిపెట్టిన విషయంలో ప్రధానమంత్రి స్పందించి ఉంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిది సంవత్సరాలలో అడిగిన బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ పునః ప్రారంభం, తెలంగాణలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి మొదలుకొని, నూతన రైల్వే లైన్లు ఏర్పాటు, రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను పక్కన పెట్టిన ప్రధానమంత్రి తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను రాష్ట్ర ప్రజలను గమనిస్తున్నారని, సరైన సమయంలో బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.

తెలంగాణలో ఏమీ అభివృద్ధి చేయకపోతే కేంద్రం తరచూ అవార్డులు ఎందుకు ఇస్తున్నారు? అని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.  ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీ వచ్చి మోదీ తిట్టిపోతారని ధ్వజమెత్తారు. తెలంగాణ సంక్షేమ పథకాలను కేంద్రం నకలు కొడుతోందని చెబుతూ మేం మంచి చేయకపోతే అవార్డులు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. 

తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటే మోదీ గొప్పతనం ఏమీ లేదని, కేసీఆర్ వల్లే పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు. పైగా,  తెలంగాణ అభివృద్ధికి మోదీ మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన లక్ష కోట్ల బకాయిలు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.  వరంగల్‌కు వచ్చిన మోడీ తెలంగాణాకు మొండి చేయి ఇచ్చి, అక్కసు వెళ్లగక్కి వెళ్ళారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కీర్తి ఢీల్లీ తాకుతుందని మోడీకి భయమన్నారని ఎద్దేవా చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles