తెలంగాణాలో `ఒవైసీ’ అస్త్రాన్ని ప్రయోగించనున్న బిజెపి!

Sunday, July 7, 2024

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో బీజేపీ అవకాశాలు అడుగంటిన్నట్లు అందరూ భావిస్తున్న వేళ సరికొత్త అస్త్రంతో  రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాస్త్రాలలో తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులకు ముస్లిం ఓట్లు పడకుండా, చీల్చడం ద్వారా తమ అభ్యర్థుల గెలుపుకు ఉపయోగించుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీను మొదటిసారిగా తెలంగాణాలో ఉపయోగించుకునేందుకు సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.

రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న అసదుద్దీన్ కేసీఆర్ సర్కారు తీరును తూర్పారా పట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం పనిచేయడం లేదని, రూ. 1200 కోట్లు ఖర్చు చేసి యాదాద్రి ఆలయాన్ని, బ్రాహ్మణ సదన్ కట్టిన కేసీఆర్.. ఇస్లామిక్ సెంటర్ విషయాన్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

అంతేకాకుండా, షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదని, సెక్రటేరియట్ పూర్తి చేసినా అందులో మసీదు విషయాన్ని గాలి కొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పటి వరకు తమ ఓట్లతో కేసీఆర్ సీఎం అయ్యారని, అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించారు.

గతంలో కాంగ్రెస్ తో, ప్రస్తుతం బిఆర్ఎస్ తో ఏర్పర్చుకున్న అవగాహనమేరకు పాతబస్తీ వరకే పోటీచేస్తూ, అక్కడ ఆయా పార్టీలు హిందువుల ఓట్లను చీల్చే అభ్యర్థులను నిలబెట్టి తమ అభ్యర్థులు గెలిపించుకొనేటట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకు ప్రతిగా హైదరాబాద్ నగరంలో మిగిలిన చోట్లగాని, తెలంగాణాలో తమకు బలమున్న చోట్లగాని ఎక్కడా అభ్యర్థులను పెట్టడం లేదు. ఆయా ప్రాంతాలలో ముస్లింల ఓట్లు బిఆర్ఎస్ కు పడేటట్లు చూస్తున్నారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చివరికంటా వ్యతిరేకించిన ఒవైసి ఇంటికి 2014 ఎన్నికలలో గెలుపొందగానే స్వయంగా వెళ్లి ప్రభుత్వంలో చేరమని కేసీఆర్ ఆహ్వానించారు. ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వజూపారు. అయితే ప్రభుత్వంలో చేరకుండా తమకు కావాల్సిన పనులను ప్రభుత్వంతో చేయించుకుంటున్నారు.

ఆ తర్వాత జాతీయస్థాయిలో బిజెపితో లోపాయికారి అవగాహన ఏర్పరచుకోవడం ద్వారా ఇతర రాస్త్రాలలో బిజెపి వ్యతిరేక ఓట్లలో చీలికకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణాలో కూడా ఇప్పుడు పాతబస్తీ వెలుపల పోటీచేసేందుకు మజ్లీస్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.

పాత నగరంలో ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎం ఈ సారి గ్రేటర్ బయట కాలు పెట్టేందుకు సిద్దపడుతున్నది. తమకు ఓటు బ్యాంకు ఉన్న జూబ్లీహిల్స్​, రాజేంద్రనగర్​, అంబర్​ పేట్​, ముథోల్​, నిర్మల్​, ఆదిలాబాద్​, ఖానాపూర్, నిజామాబాద్​, కామారెడ్డి, బోధన్​, కరీంనగర్, జగిత్యాల, మహబూబ్​ నగర్​, వరంగల్​ ఈస్ట్​, ఖమ్మం సహా పలు నియోజకవర్గాల్లో పోటీకి ప్లాన్​ చేసుకుంటోంది.

కనీసం 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలిపే ప్రయత్నాల్లో ఆ పార్టీ ముఖ్య నేతలున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు బిఆర్ఎస్, కాంగ్రెస్ లకు పడకుండా చేయడంతో పాటు, మజ్లిస్ బూచిని చూపి హిందువుల ఓట్లు బిజెపికి గంపగుత్తుగా పడేందుకు సహకరిస్తారని అంచనా వేస్తున్నారు. 

అయితే బిజెపికి అనుకూలంగా అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ ఎత్తుగడలను పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఢిల్లీ వంటి చోట్ల గ్రహించిన ముస్లింలు ఆ పార్టీకి విశ్వసించలేదు. తెలంగాణాలో ఏమవుతుందో చూడాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles