తెలంగాణాలో అవినీతి పాలన అన్న మోదీపై బిఆర్ఎస్ మంత్రుల నిప్పులు

Sunday, December 22, 2024

కుటుంబ పాలనతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని అంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఆ వెంటనే బిఆర్ఎస్ మంత్రులు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆయనకు స్వాగతం పలికి, ఆయనతో పాటు చిరునవ్వుతో కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆ వెంటనే బిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంకు వెళ్లి ప్రధాని పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతి గురించి ప్రధాని మాట్లాడుతున్నారని అంటూ అసలు అదానీ అవినీతి సంగతేంటని ప్రశ్నించారు. శ్రీలంకలో అదానీకి వచ్చిన కాంట్రాక్టు ఎవరి ద్వారా వచ్చింది? అదానీ మోసాలపై జేపీసీ వేయమంటే ఎందుకు వేయరు? తెలంగాణ అభివృద్ధి గురించి మోదీ నాతో చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి సాధించకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తోందని నిలదీశారు.

కేవలం ఆదానిపై చర్చను నివారించడం కోసం తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో బిజెపి సభ్యులే అల్లర్లు సృష్టించి, ఎటువంటి చర్చ జరుపకుండా సుమారు రూ 50 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను ఆమోదింప చేసుకొని, ఇప్పుడు ప్రధాని అవినీతి గురించి మాట్లాడతారా? అంటి బిఆర్ఎస్ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. పైగా, టెన్త్ ప్రశ్న పత్రాల అక్రమాలలో అడ్డంగా దొరికిన బండి సంజయ్ ను పక్కన పెట్టుకొని ప్రధాని అవినీతి గురించి మాట్లాడటమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని మోదీ అన్నారని చెబుతూ కేంద్రం ఏమిచ్చిందని అడ్డుకోవడానికని తలసాని నిలదీశారు. మోదీ  అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాత్రమే మాట్లాడారని ధ్వజమెత్తారు.  తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అవునో కాదో?  24 గంటల కరెంట్ రాష్ట్రంలో ఉందో లేదో? మోదీనే చెప్పాలని సవాల్ చేశారు.

పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని మోదీ వ్యాఖ్యానించటంపై

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  “ప్రధాన మంత్రికి సిగ్గుందా? పార్లమెంట్‌లో అన్ని బిల్లులకు సహకరించలేదా? రైతులకు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టే.. మేము మిమ్మల్ని విధానపరంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని సీఎం కేసీఆర్ చెప్పారు.”అని గుర్తు చేశారు.

రైతులను ముంచి అదానికి అంబానీకి దోచి పెడితే, నీకు సపోర్ట్ చేయాలా? అని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు పరం చేస్తున్నందుకు నీకు సపోర్ట్ చేయాలా? అని ప్రశ్నించారు. “సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత.. ప్రజల కోసం, తెలంగాణ కోసం జైలుకు పోయారు. అవినీతి అదానీలను పక్క పెట్టుకొని అవినీతి గురించి మాట్లాడటానకి సిగ్గు లేదా? సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను ఏమైనా అంటే ఊరుకోము. నీపై కూడా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం” అంటూ హెచ్చరించారు.

“మా ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారు. మొన్న మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. నిన్న పేపర్ లీకులు చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర పన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదంటున్న మోదీ.. తెలంగాణకు ఏం చేశారు..? తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఏమయ్యాయి? తెలంగాణకు అన్యాయం చేస్తున్న నీకు ఎలా సహకరించాలి..?” అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

“కేసీఆర్ రాష్ట్ర సంపద ప్రజల అభివృద్ధికి పంచుతుంటే.. దేశ సంపదను మోదీ తన దోస్తులకు దోచి పెడుతున్నారు. కేసీఆర్‌ను సహకరించడం లేదు అంటున్న మీరు తెలంగాణకు ఏం సహకరించారు. తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు. మీరు కేవలం గుజరాత్‌కు మాత్రమే ప్రధాని.. దేశానికి కాదు. తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు” అంటూ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“బండి సంజయ్ చిల్లర మనిషి. పేపర్ లీక్ చేసి జైలుకు వెళ్తే ఆయన్ను మందలించాల్సింది పోయి.. అభినందిస్తున్నారు. మిమ్మల్ని దోషిగా నిలబెట్టే రోజు వస్తుంది. మీ ప్రవర్తన చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుంది. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకుంటూ దొరికిన బండి సంజయ్‌ని ప్రశంసించిన నీకు సహకరించాలా..? తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి” అంటూ ఆమె ఘాటుగా స్పందించారు.

కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోదీకి ఏమీ చేత కాద మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎద్దేవా చేశారు. అదానీ కోసమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కన బెట్టారని ఆరోపిస్తూ  బీజేపీ గతంలో కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. మోదీ సీబీఐని గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనలేదా? అని నిలదీశారు.

అవినీతి బీజేపీ సీఎంలపై సీబీఐ విచారణ ఎందుకు జరిపారని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రశ్నించారు. మోదీ తెలంగాణకు ప్రాజెక్టులు ఇస్తారంటే ఎందుకు వద్దంటామని అడిగారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles