`తెలంగాణాలో అధికారం’ కాంగ్రెస్ కు పగటి కల మాత్రమేనా!

Sunday, June 16, 2024

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణాలో అధికారంలోకి రావడంపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలు మీడియాలో చేస్తున్న హడావుడి క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. పీపుల్స్ పల్స్ అధ్యయనం ప్రకారం  సుమారు 70 నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలుపొందే అవకాశాలు లేవు. ఎంత కష్ట పడినా, బిఆర్ఎస్ వ్యతిరేక వేవ్ ఏర్పడినా 30 నుండి 35కు మించి సీట్లు గెల్చుకొనే అవకాశాలు లేవని వెల్లడవుతుంది.

2009లో వై ఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం జరిగిన అన్ని ఉపఎన్నికలు, రెండు సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతూ వస్తున్నది. 52 స్థానాల్లో ఒక్క సారి కూడా కాంగ్రెస్ గెలుపొందలేదు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రామస్థాయిలో బలహీనమౌతూ వస్తున్నది.

2018 ఎన్నికల్లో కేవలం 6 నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ కు 50 శాతంకు మించి ఓట్లు వచ్చాయి. గెలుపొందిన 19 మందిలో 12 మంది పార్టీ ఫిరాయించగా, కాంగ్రెస్ ఉపఎన్నికల్లో మరో సీటు కోల్పోయింది. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఎమ్యెల్యేలు ఉన్నారు.  2014, 2018 ఎన్నికల్లో గెలుపొందిన వారు పార్టీ మారడంతో, ఇపుడు గెలిపించినా ఎంతవరకు కాంగ్రెస్ లో కొనసాగుతారని అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. ఇటువంటి అనుమానాలను ప్రజలలో తొలగించేందుకు కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.

పైగా, వరుసగా ప్రతి ఎన్నికలో కూడా ఎందుకు ఘోర వైఫల్యాలు ఎదురవుతున్నాయో ఇప్పటి వరకు ఆత్మపరిశీలన చేసుకోకుండా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తామని వారు సంబరపడటం ఊహాలోకంలో విహరించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. 

2018 ఎన్నికలో ఎందుకు ఓడిపోయామో ఇప్పటి వరకు లోతయిన విశ్లేషణ జరుపుకోలేదు. కేవలం టిడిపితో జత కట్టడంతోనే ఓడిపోయామని చెప్పుకొంటున్నారు. కానీ పలు సర్వేలలో 40 శాతం మంది ప్రజలు టిడిపితో జతకట్టడాన్నీ స్వాగతించగా, కేవలం 35 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. పలు చోట్ల టీడీపీ మద్దతు కారణంగా కాంగ్రెస్ కొన్ని సీట్లు గెల్చుకుంది కూడా. 

కాంగ్రెస్ నియమించుకున్న వ్యూహకర్త సునీల్ కొనుగోలు పార్టీ నాయకత్వంకు ఇచ్చిన నివేదిక ప్రకారం 41 నియోజకవర్గాల్లో పార్టీ  బాగోలేదు.  వివిధ సామాజిక వర్గాల మద్దతును కూడాదీసుకోవడంలో కూడా కాంగ్రెస్ వెనుకబడుతున్నది. ఈ విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వివిధ సామజిక వర్గాల ఓటర్లలోకి చొచ్చుకు పోతున్నారు.

రెడ్ల సామజిక వర్గంలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ మంది బిఆర్ఎస్ కు వోట్ వేస్తూ వస్తున్నా ఆ పార్టీకి `రెడ్ల పార్టీ’ అనే పేరొచ్చింది. కానీ బిఆర్ఎస్ కు `కేసీఆర్ కుటుంభ పార్టీ’ అనే పేరు తప్ప ఒక కులానికే చెందిన పార్టీ అనే పేరు లేదు. పైగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ తో ధీటైన అభ్యర్థి కాంగ్రెస్ లో గాని, బీజేపీలో గాని లేవు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles