తెలంగాణలో బీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తుకు రంగం సిద్ధం!

Wednesday, January 22, 2025

ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాలలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటూ వస్తున్న బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మధ్య కొంతకాలంగా ఒక విధమైన మౌనం నెలకొంది. రెండు పార్టీలు దగ్గరవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతేకాదు రాజకీయ పొత్తులకు కూడా సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. తెలంగాణాలో కాంగ్రెస్ అగ్రనేత కె జానారెడ్డి స్వయంగా ఈ విషయమై వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.

సుమారు ఒక ఏడాది క్రితం హనుమకొండలో కాంగ్రెస్ జరిపిన బహిరంగసభలో మాట్లాడిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టిపరిస్థితులలో బిఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతలు ఆ మాట అనలేక పోతున్నారు.  రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటంతో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల్లో ఐక్యత మరింత పెరిగింది.

ఈ విషయంలో అనర్హత వేటు ప్రజాస్వామ్యంకు ప్రమాద సంకేతం అంటూ రాహుల్ కు బాసటగా నిలిచిచిన నాయకులలో జాతీయ స్థాయిలో కేసీఆర్ ను మొదటివారుగా పేర్కొనవచ్చు.  ఈ క్రమంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ దోస్తీకి నెమ్మదిగా సంకేతాలు వెలువడ్డాయి.అప్పటి నుండి పార్లమెంట్ లో పలు సందర్భాలలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు చేబడుతున్న కార్యక్రమాలలో బిఆర్ఎస్ పాల్గొంటున్నది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా బిల్లుపై ఢిల్లీలో ఆందోళన చేసిన సమయంలో యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి సెల్యూట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కూడా సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. కేసీఆర్ నేరుగా కాంగ్రెస్ పై విమర్శలు దాదాపుగా మానివేశారు.

ఇటువంటి సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అనేది ప్రజలే నిర్ణయిస్తారని జానారెడ్డి జోస్యం చెప్పారు. కేంద్రం తీరుపై 17 ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నామని చెప్పిన జానారెడ్డి వాటిల్లో బిఆర్ఎస్ కూడా ఉండటాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాలు ఐక్యతగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిలుపు ఇవ్వడం ద్వారా బిఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తు అనివార్యం అనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.

బిజెపి ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని, బీఆర్ఎస్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి అండగా నిలిచినట్లు చెప్పడం ద్వారా రెండు పార్టీలు ఇప్పటికే కొన్ని పరిమితులలో కలసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే, బీఆర్ఎస్‌తో పొత్తు అనేది ఎన్నికలప్పుడు నిర్ణయించుకుంటామని చెప్పడం ద్వారా నేరుగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇదే సమయంలో బిఆర్ఎస్ ప్రారంభ సమయంలో తమ మొదటి ఎన్నికల పోరాటం కర్ణాటక నుండే ప్రారంభం అవుతుందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా అటువైపు చూడటం లేదు. జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించినా ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకు రావడం లేదు.

కర్ణాటక ఎన్నికలలో జేడీఎస్ తో కలసి పోటీ చేస్తే కాంగ్రెస్ కు నష్టం జరిగి, పరోక్షంగా బిజెపికి ప్రయోజనం కలుగుతుందనే అంచనాకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. తెలుగు వారు ప్రభావం ఉన్న సుమారు 25 నియోజకవర్గాలలో గత ఎన్నికలలో బీజేపీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది. ఇప్పుడు బిఆర్ఎస్ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పడి బిజెపి ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

కర్ణాటకలో కాంగ్రెస్ సానుకూల ఫలితాలు రాగలవని పలు సర్వేలు చెబుతున్న సమయంలో అక్కడ బిజెపిని అధికారంలోకి తిరిగి రాకుండా చేయడం కోసమే కేసీఆర్ పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ తో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పొత్తు ఏర్పర్చుకుంటారా? ఎన్నికల తర్వాత చూస్తారా? పరిస్థితులను బట్టి ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles