జనసేనాని పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రచార రథం వారాహికి పూజాదికార్యక్రమాలు నిర్వహించేందుకు వెళ్లిన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పర్యటనలో ప్రధానంగా రాజకీయ అంశాలను ప్రస్తావించారు. సాధారణంగా తెలంగాణ రాజకీయాలపై మరీ అంత ఫోకస్‌తో మాట్లాడే అలవాటు లేని పవన్ కల్యాణ్ ఈ దఫా.. తెలంగాణ అసెంబ్లీలో ఎన్ని సీట్లు టార్గెట్ చేస్తున్నామో కూడా స్పష్టంగా చెబుతూ తమ పార్టీ పోటీ గురించి సంకేతాలు ఇచ్చారు. తెలుగుదేశంతో తెలంగాణలో కూడా పొత్తు ఉండచ్చుననే కొన్ని ఊహాగానాలకు పవన్ కల్యాణ్ మాటలు ఎంతో ఊతం ఇస్తున్నాయి.
కొండగట్టు పర్యటనలో పవన్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపితో పొత్తు ఉండదని ప్రకటించారు. అదే సమయంలో తమ పార్టీ భావజాలానికి దగ్గరగా ఉండేలా ఎవరు వచ్చినాసరే పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధం అని కూడా వెల్లడించారు. తెలంగాణలో 25-40 ఎమ్మెల్యే స్థానాల్లో, 7-14 ఎంపీ స్థానాల్లో పోటీచేయాలని అనుకుంటున్నట్టు కోరికను వ్యక్తం చేశారు. పవన్ మాటలతో ఇక్కడి పొత్తుల క్లారిటీ వస్తోంది.
భాజపాతో పొత్తును ఆయనకూడా ఆశించడం లేదు. తెలంగాణలో ఏనాటికైనా సొంతంగా అధికారంలోకి రావాలని కల గంటున్న భాజపా, ఈ ఏడాది ఎన్నికల్లో అది అసాధ్యం అయినప్పటికీ ఒంటరిగా మాత్రమే బరిలోకి దిగాలనుకుంటోంది. తెలుగుదేశం ఇప్పుడే మళ్లీ తెలంగాణలో అస్తిత్వం చాటుకుంటోంది. పవన్ కోరుకుంటున్నట్టుగా 40 స్థానాలు ఇవ్వడానికైనా వారికి అంగీకారంగానే ఉంటుంది. నిజానికి తెలంగాణలో సైతం జనసేన- తెలుగుదేశం రెండు పార్టీలు చిత్తశుద్ధితో కలసికట్టుగా పనిచేస్తే బలీయమైన రాజకీయశక్తిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇరువురికీ ప్రస్తుతం ఉన్న బలం ఏమీ లేదు కాబట్టి.. ఎంతో కొంత లాభం ఉంటుందే తప్ప నష్టం ఉండదు. ఆ రకంగా చూసినప్పుడు తెలంగాణలో టీడీపీతో పొత్తు ఖరారైనట్టే అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
పైగా జనసేన- తెలుగుదేశం బంధానికి తెలంగాణ ఎన్నికలు ఓ లిట్మస్ టెస్ట్ లాగా, ట్రయల్ రన్ లాగా కూడా ఉపయోగపడతాయి. వీరిద్దరి కలయికను ప్రజలు ఎలా ఆదరిస్తారో కొంత సంకేతమాత్రంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మళ్లీ ఏపీలో పొత్తు బంధాల్లో మార్పు చేర్పులు చేసుకోవడానికీ అవకాశం ఉంటుంది.
తెలంగాణలో టీడీపీ- జనసేన పొత్తు ఖరారే!
Wednesday, January 22, 2025