ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుల విషయం ఇంకా ఒక కొలిక్కి రాకముందే మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తెలంగాణాలో మాత్రం పోటీకి సిద్దపడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణాలో పోటీ చేయని పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన మొదటిసారిగా పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభిస్తుంది.
అయితే, అన్ని నియోజకవర్గాలలో కాకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నట్లు, ముఖంగా పవన్ కళ్యాణ్ కు చెందిన సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉన్న సీట్లలో పరిస్థితులను బేరీజు వేస్తున్నట్లు తెలుస్తున్నది. 26 నియోజకవర్గాలకు ఇప్పటికే ఇన్ ఛార్జ్ లను కూడా నియమించారు. మొత్తం 30 నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నారు.
మరోవంక, టిడిపి సహితం ఇటువంటి వ్యూహాన్నే అనుసరిస్తుంది. సీమాంధ్ర ప్రజలు గణనీయంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నది. కనీసం 40 నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిణామాలు వచ్చే ఎన్నికలలో తన సత్తా చూపాలని చూస్తున్న బీజేపీలో కలవరంకు దారితీస్తున్నాయి.
తెలుగు దేశంతో పొత్తు ప్రసక్తి లేకపోయినా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఐదేళ్ల తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ఇటీవల భేటీ కావడం తెల్లనగానలోని సీమాంధ్ర ఓటర్లకు సానుకూల సందేశం పంపడం కోసమే అని స్పష్టం అవుతుంది. పైగా, ఏపీ పర్యటన సందర్భంగా జెపి నడ్డా, అమిత్ షా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దేశంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వం అంటూ దండెత్తడం సహితం తెలంగాణ ఓటర్ల కోసమే అనే అభిప్రాయం నెలకొంటుంది.
అటువంటప్పుడు టిడిపి, మిత్రపక్షం అనుకొంటున్న జనసేన ఇక్కడ అభ్యర్థులను నిలబెడితే బిజెపి అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకొంటున్న గ్రేటర్ హైదరాబాద్ లోని సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీచేస్తే బీజేపీ అభ్యర్థులకె ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
మరో వైపు రానున్న ఎన్నికల్లో సత్తా చాటి కింగ్ మేకర్‌గా నిలవాలని మిగిలిన పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దృష్టి సారించారు..
అంతేకాకుండా త్వరలోనే తెలంగాణాలో వారాహి యాత్ర కూడా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఇటీవల తెలిపారు. ఆయన యాత్ర ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా కేంద్రీకృతమయ్యే అవకాశముంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ – రెండు పార్టీలు గ్రేటర్ హైదరాబాద్ లో బలహీనంగా ఉండటం, గత జిహెచ్ఎంసి ఎన్నికలలో బిఆర్ఎస్ తో పాటు దాదాపుగా ఓట్లు, డివిజన్ లను కూడా బీజేపీ గెల్చుకోవడంతో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.
పైగా, పలు సందర్భాలలో తెలంగాణాలో జనసేనతో పొత్తు ప్రసక్తి లేదని అంటూ ఆ పార్టీకి అసలు ఇక్కడ ఉనికి లేదన్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. దానితో బిజెపికి ఓ గుణపాఠం నేర్పాలనే పట్టుదల ఆ పార్టీ శ్రేణులలో కనిపిస్తున్నది. తెలంగాణలో జనసేన సత్తా చూపించేలా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా ఉండగా, జనసేన ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.