రెండు వారల వ్యవధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్ధాంతరంగా ప్రధాని నరేంద్ర మోదీని కలవడం కోసం ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాలలో పలు ఊహాగానాలకు దారితీస్తుంది. గత పర్యాయం తమ్ముడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిబిఐ సిద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీకి వెళ్లారు. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మధ్యలో వెళ్లారు.
ఇప్పుడు ఒకవంక విశాఖపట్నంలో ప్రతిష్టాకరమైన జి20 సమావేశాలు జరుగుతున్నాయి. మరోవంక రెండు, మూడు రోజులలో మంత్రివర్గంలో మార్పులు అంటున్నారు. ఈ సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లడం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల కోసమే అనే ప్రచారం జరుగుతున్నది. తాజా గ్రాడ్యూయేట్ ఎమ్యెల్సీ ఫలితాలు సీఎం జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయగా, మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం గమనిస్తే సొంతపార్టీలో వ్యవహారాలు సజావుగా లేవని వెల్లడైంది.
మరోవంక, కనీసం 40 మంది వరకు పార్టీ ఎమ్యెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, తగు సమయంలో పార్టీపై తిరుగుబాటుకు సిద్దమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల్లో టీడీపీ శ్రేణులలో ఉత్సాహం నింపుతున్నది. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే టిడిపి బలపడి, వైసీపీ ఓటమికి సిద్ధం కావలసి ఉంటుందని సీఎం జగన్ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.
గత కొంతకాలంగా టీడీపీ – జనసేనల మధ్య పొత్తు దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉండటం నిద్రపట్టకుండా చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబుపై ఉన్న రాజకీయ కక్ష కారణంతోనే అమరావతిని పక్కనపెట్టారన్న విషయం కూడా ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లింది. ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్య కేవలం నవరత్నాల అమలు కోసం లక్ష కోట్లను ఖర్చు పెట్టడం కూడా అర్థరహితమన్న వాదన కూడా బలపడినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు రోజులు గడిచిన కొద్దీ ప్రజా వ్యతిరేకత పెరిగేందుకు దారితీయవచ్చనే ఆందోళన అధికార పక్షంలో కలిగిస్తున్నది.
అందుకనే తెలంగాణ అసెంబ్లీతో పాటు నవంబర్ లోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగే విధంగా ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో సంప్రదింపులకు వెళ్లారని పలువురు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికల కోసమని అసెంబ్లీని రద్దు చేసినా సాంకేతిక కారణాలతో ఎన్నికల కమీషన్ జరపని పక్షంలో రాష్ట్రపతి పాలనకు దారితీసే అవకాశం ఉంది. అందుకనే, ముందుగా ఢిల్లీలోని పెద్దలను కలిసి, వారి భరోసాతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలు ఉన్నట్లు కనిపిస్తుంది.
మరోవంక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఎటువైపు తిరుగుతుందో చెప్పనలవి కాకుండా ఉంది. సుప్రీంకోర్టు కొత్తగా సిట్ ను ఏర్పరిచి, నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయమని ఆదేశించింది. అంతేకాకుండా, హత్య వెనుక ఉన్న కుట్రకోణంను నిగ్గు తేల్చమని కూడా ఆదేశించింది.
పట్టభద్రుల నుండి ఎమ్యెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో రాయలసీమలో రెండు సీట్లు కోల్పోవడానికి ఈ కేసు కూడా కొంతమేరకు దారితీసిన్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. మొదటిసారిగా పులివెందులలో టిడిపి సంబరాలు జరుపుకునే పరిస్థితులు ఏర్పడటం వైసిపి నేతలు ఆందోళన కలిగిస్తున్నది.
మరోవంక, ప్రస్తుతం రాష్ట్రానికి నిధుల సమస్య వెంటాడుతోంది. కేంద్రం నుంచి నిధుల రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం కూడా కష్టమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా పథకం నిలిచిపోయానా, కాస్త వాయిదా పడినా ఆయా వర్గాల్లో వ్యతిరేక భావన పెరిగే ప్రమాదం ఉంది.
అందుకనే టిడిపి నిలదొక్కుకొని, సవాల్ విసిరే వరకు అవకాశం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇటువంటి పరిణామాలను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముందే గ్రహించినట్లు కనిపిస్తున్నది. అందుకనే ఆయన కొద్దీ రోజులుగా నవంబర్ లోనే ఎన్నికలు రావచ్చని, సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా, గతంలో కన్నా భిన్నంగా ముందుగా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే మే 28తో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తయిన తర్వాత రెండు నెలల్లో చాలావరకు అభ్యర్థులను ఖరారు చేసి, ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.