తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉంటానే ఉద్దేశంతోనే సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని తన అనుచరులతో హత్య చేయించి, దానిని గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారం చేయడానికి ప్రయత్నించారని ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రేపో మాపో అరెస్టు అవుతారనే భయాలు ఆయన వర్గీయుల్లో వ్యాపిస్తున్న సమయంలో.. ఒక కొత్త, కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్యను తానేనంటూ షేక్ షమీమ్ అనే మహిళ సీబీఐ ను ఆశ్రయించారు. సీబీఐకు తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవైపు ఈనెల 30 వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు హుకుం జారీ చేసి ఉండగా, సీబీఐ చురుగ్గా పనిచేస్తున్నవేళ షేక్ షమీమ్ తెరపైకి రావడం ఆసక్తికరంగా ఉంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నాలుగేళ్లు దాటుతోంది. ఆయన రెండో భార్య షమీమ్ ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నారో తెలియదు. ఏమైపోయారో తెలియదు. తొలినుంచి కూడా వివేకా రెండో వివాహం గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నదని బయటపడిన తర్వాత, ఆయన వైపు నుంచి రెండో భార్య వివరాలు బాహాటంగా రావడం మొదలైంది. అసలుఈ హత్యతో తనకు సంబంధమే లేదని, వివేకాకు రెండో పెళ్లి అయిందని, ఆమె ద్వారా పుట్టిన కొడుకునే ఆయన రాజకీయ వారసుడు చేయాలని అనుకున్నాడని, ఆస్తులు వారికి ఇవ్వాలనుకున్నాడని, ఆ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులే ఈ హత్య చేయించారని అవినాష్ చెబుతూ వచ్చారు. తాము చెబుతూ వచ్చిన వాదనను మరింతగా ధ్రువీకరించడానికి వైఎస్ అవినాష్ వర్గీయులే ఇప్పుడు ఆమెను బ్రహ్మాస్త్రంలాగా ప్రయోగిస్తున్నారా? అనే అభిప్రాయాలు కొందరిలో ఉన్నాయి.
ఇప్పుడు సీబీఐ ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన షేక్ షమీమ్ అచ్చంగా అవినాష్ రెడ్డి కొంతకాలంగా చెబుతున్న విషయాలనే కాపీ పేస్ట్ చేసినట్టుగా వ్యవహరించడం కూడా గమనించవచ్చు. వైఎస్ వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి తనను బెదిరించేవాడని, ఆయన చెక్ పవర్ ను కూడా కుటుంబసభ్యులు అన్యాయంగా తొలగించారని, బెంగుళూరు లాండ్ సెటిల్మెంట్ లో 8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పారని, హత్యకు కొన్ని గంటల ముందు కూడా తనతో మాట్లాడారని షమీమ్ ఇప్పుడు అంటున్నారు.
షమీమ్ తెరపైకి వచ్చి వెల్లడించడం మనకు కొత్తగా ఉండవచ్చు గానీ.. ఆమె చెబుతున్న సంగతులు.. ఎంతోకాలంగా అవినాష్ చెబుతూ వస్తున్నవే. ఈ నేపథ్యంలో ఆమె చెప్పిన విషయాలన్నింటినీ నిగ్గుతేల్చడం సీబీఐ పని. ఆ విషయాలన్నీ తేల్చడానికి ఇంకా చాలా కాలం పట్టొచ్చు. హత్య వెనుక అవినాష్ పాత్రపై సీబీఐ ఒక నిర్ధరణకు వస్తున్న సమయంలో , షమీమ్ రాక వల్ల విచారణ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
తెరపైకి షేక్ షమీమ్ : వైఎస్ కోటరీ బ్రహ్మాస్త్రమేనా?
Monday, December 23, 2024