ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ పార్టీలు అతి తెలివితేటలతో మాట్లాడుతూ ఉండడం చాలా సహజం. అదే రకంగా.. తమ తమ ప్రత్యర్థి పార్టీల నుంచి అంతో ఇంతో బలమైన నాయకులను తమ పార్టీలో కలిపేసుకోవడానికి కూడా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటారు. ఎవరి ప్రలోభాలు వారు పెడుతుంటారు. నాయకులు వచ్చినా రాకపోయినా.. ఇలాంటి ఆట మాత్రం నడుస్తూనే ఉంటుంది. అయితే వైసీపీ నాయకుల మాటలే తమాషాగా అనిపిస్తున్నాయి.
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాకు ఎదురునిలిచి, విజయవాడ ఎంపీ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున ఘన విజయం సాధించిన కేశినేని నాని ప్రస్తుతం రకరకాల కారణాల వల్ల సొంత పార్టీ మీద అసంతృప్తిగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన అసంతృప్తి కారణాలను ఇప్పటిదాకా వెల్లడించలేదు గానీ.. తాను చచ్చే దాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటానని, ఎన్నికల్లో పోటీచేసినా, చేయకపోయినా పార్టీ మారే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో ఆయన వెల్లడించారు. అలాంటి కేశినేని నాని మీద వైసీపీ ఇప్పుడు కొత్తగా మైండ్ గేమ్ ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది.
కేశినేని నాని తమ పార్టీలోకి వస్తే గనుక.. సాదరంగా ఆహ్వానిస్తాం అంటూ.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎంతో విశ్వసనీయ నాయకుడు అయిన కేశినేని వైసీపీలోకి ఎందుకు వెళతారు? అనే చర్చ తరువాత. కానీ ఇలాంటి మైండ్ గేమ్ ద్వారా.. అసలే అసంతృప్తిగా ఉన్న కేశినేని అనుచరుల్లో ఒక డైలమాను సృష్టించాలని, ఆరకంగా ఆయన అనుచరులకు వలవేసి ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకోవచ్చునని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది. ఆయన మాత్రం ఆలూ చూలూ లేకుండా కొడుక్కు పేరు పెట్టేస్తారు గానీ.. తెలుగుదేశం పార్టీ మాటలను మాత్రం తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు.
ఇప్పటికే అధికార వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ముగ్గురు ఓటు వేయడం వల్లనే.. శాసనసభ కోటాలో ఎమ్మెల్సీని తెలుగుదేశం గెలుచుకుంది. ఇంకా సుమారు పాతిక మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలుగుదేశం అంటోంది. తెదేపా మాటలు మాత్రం మైండ్ గేమ్ అట. తాము చెబితే మాత్రం.. కేశినేని వైసీపీ వైపు చూస్తున్నట్టుగా ప్రజలు నమ్మాలట. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మైండ్ గేమ్ వ్యవహారాలలో కొత్త టెక్నిక్కులు కనుగొంటున్నట్టున్నారు.
తెదేపా చేస్తే మైండ్‌గేమ్.. వైసీపీ వారిదైతే ఫ్యాక్ట్!
Wednesday, January 22, 2025