తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబునాయుడు ఫోకస్ పెంచుతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలు స్వీకరించిన తర్వాత.. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఖమ్మంలో భారీ బహిరంగ సభతో తెలంగాణలో పార్టీకి ఇంకా పదిలంగా ఉన్న ప్రజాభిమానాన్ని చాటిన తెలుగుదేశం, పెరేడ్ గ్రౌండ్స్ లో కూడా భారీ సభను నిర్వహించబోతోంది. వీటితో పాటు.. ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో పార్టీ కార్యక్రమాన్ని చంద్రబాబునాయుడు ఆదివారం చంద్రబాబునాయుడు ప్రారంభించారు.
తెలంగాణ లో రాష్ట్ర విభజన తర్వాత.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి నెమ్మదిగా దిగజారింది. విభజన నాటికి అపూర్వంగా కాకపోయినప్పటికీ తెలుగుదేశం బలంగానే ఉన్నదిగానీ.. ఆ బలాన్ని కేసీఆర్ తన చాణక్య రాజకీయంగా చావుదెబ్బ కొట్టారు. ఆయన స్వయంగా తెలుగుదేశం నుంచి బయటకు వెళ్లిన నాయకుడే కాబట్టి.. ఆ పార్టీలో తనకున్న పాతపరిచయాలు అన్నింటినీ తిరగతోడారు. వారికి రకరకాల తాయిలాలు ఆశచూపుతూ పార్టీలోకి లాక్కున్నారు. తెలుగుదేశం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కూడా అనైతికంగా ఫిరాయింపజేసి తన పార్టీలో కలిపేసుకుని మంత్రిపదవులు కూడా కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీని దాదాపుగా ఖాళీ చేశారు.
కానీ తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ మాత్రం చెక్కు చెదరలేదు. నాయకులు వలసలు పోయారు. పోటీకి సరైన అభ్యర్థులు కూడా లేని స్థితిలో పార్టీపై అభిమానం ఉన్న ప్రజలు కూడా ఇతరులకు ఓటు వేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈ పరిస్థితిలో మార్పుతీసుకురావడానికి ప్రస్తుతం పెద్ద ప్రయత్నమే జరుగుతోంది. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ప్రజాదరణ మిగిలిఉన్నదని నిరూపించేలా కొన్ని సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో వ్యూహరచన, కసరత్తు జరుగుతోంది.
ఇతర పార్టీలనుంచి తెలుగుదేశంలోకి కొన్ని వలసలు కూడా ఉంటాయనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి తెలంగాణలో భారాస, భాజపా తీవ్రస్థాయిలో తలపడుతున్నాయి. కాంగ్రెస్ కూడా తమ అస్తిత్వం నామమాత్రంగా మారుతున్నప్పటికీ.. పోటీ ఇస్తోంది. వీరందరి నడుమ.. షర్మిల తన వైతెపా పార్టీతో సందడి చేస్తోంది. ఇక్కడ రాజకీయ శూన్యత లేదు.
కానీ, తెలుగుదేశానికి క్షేత్రస్థాయిలో ఉన్న గుర్తింపు, ప్రజల్లో ఆదరణ మాత్రమే వారికి బలాలు. ఇప్పుడు ప్రారంభించిన ఇంటింటికీ తెలుగుదేశం వంటి కార్యక్రమాలు.. ప్రజల్లో పార్టీ మళ్లీ నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తాయి.
కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి.. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసేది మనమే అని చెబుతుండవచ్చు గానీ.. తెలుగుదేశం కొంత బలపడితే.. కనీసం గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.
తెతెదేపాకు కొత్త వైభవం రానున్నదా?
Wednesday, December 25, 2024