2016లో రాజకీయ కలకలం రేపిన తుని రైలు దహనం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. నిందితులపై రైల్వే పోలీసులు సరైన సాక్ష్యాలు చూపించలేకపోయారని కోర్టు ఈ కేసును కొట్టేయడం గమనార్హం. ఈ కేసును సరిగ్గా విచారణ చేయని ముగ్గురు రైల్వే పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.
ఈ కేసులో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజా సహా 41 మందికి ఊరట లభించింది. 2016 జనవరి 31న కాపు నాడు సభ సమయంలో తుని రైల్వే స్టేషన్ లో రైలును దగ్ధం చేశారు ఆందోళనకారులు.
కాపులకు రిజర్వేషన్ల కల్పించాలని డిమాండ్‌తో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన సభ సందర్భంగా అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు పధకం ప్రకారం ఈ రైలు దగ్ధం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆ సమయంలో కీలక పదవులలో ఉన్న కొందరు పోలీస్ అధికారులు సహితం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శలు చెలరేగాయి.
అయితే పోలీసులు, రైల్వే పోలీసులు పెట్టిన పలు కేసులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో అందులో జరిగిన కుట్ర గురించి రాష్ట్ర పోలీసులు చెప్పుకోదగిన దర్యాప్తు జరపడం సాధ్యం కాలేదు. అయితే రైల్వే ఆర్పీఎఫ్ నమోదు చేసిన కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన రైల్వే కోర్టు సరైనా ఆధారాలు లేని కారణంగా కేసులు కొట్టివేసింది.
ఆ సమయంలో తునిలో తలపెట్టిన కాపు గర్జన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు తుని రైల్వే స్టేషన్ లో ఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పుపెట్టారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం అయింది. అప్పట్లో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ కేసులో 20 మందిని విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజా, నటుడు జీవీ వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. కేసు విచారణలో చేపట్టిన కోర్టు దర్యాప్తులో, నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని అభిప్రాయపడింది. నిందితులపై సరైన సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచలేకపోయారని జడ్జి చెప్పారు. ఈ మేరకు ముగ్గురు విచారణ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది.
కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వేలాదిగా కాపు సామాజిక వర్గం ప్రజలు, పలు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. సభ అనంతరం ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి.
బహిరంగ సభకు దగ్గర్లోని తుని రైల్వే స్టేషన్ లోకి ఆందోళనకారులు చొచ్చుకువచ్చి. . స్టేషన్ లోని రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. దీంతో రైల్వే అధికారులు కాపు గర్జన సభకు పిలుపునిచ్చిన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా 41 మందిపై కేసు నమోదు చేశారు.