తిరుమల ప్రసాదం లడ్డూ నెయ్యికు రాజకీయ గ్రహణం

Sunday, December 22, 2024

తిరుమల తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఆ శ్రీవారిపై ప్రజలకు ఎంత భక్తి ఉందో తిరుపతి దేవస్థానంలో లభించే లడ్డూలంటే అంత ప్రేమ. తిరుపతిలో లభ్యమయ్యే లడ్డు ప్రసాదం రుచిలో కూడా తిరుగులేనిది. తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కర్ణాటకకు చెందినదని చాలా మందికి తెలియదు.  ఇప్పటివరకు తిరుపతిలో తయారు చేసే లడ్డూలకు కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని వాడేవారు.

అయితే, ఇప్పుడు తిరుపతిలో తయారు చేసే లడ్డూలకు ఇకపై నందిని నెయ్యి వాడరు. దాదాపు 50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూ, నందినిల మధ్య సంబంధాలు తెగిపోయాయి.  తిరుపతి లడ్డూ తయారీకి ఇంత కాలం సరఫరా చేస్తున్న నెయ్యి ఇకపై పంపబోమని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేయడంతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగుతుంది.  తిరుపతికి 6 నెలల్లో 14 లక్షల కిలోల నెయ్యి ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆలయానికి రాయితీపై నెయ్యి సరఫరా చేసేవారు. 

కానీ, ఈసారి తక్కువ ధరకు నెయ్యి అందించలేమని చెప్పి నందిని నెయ్యి తగ్గింపు ధరకు అందించే టెండర్ ను కేఎంఎఫ్ విరమించుకుంది. కర్ణాటకలో పాల కొరత ఉన్నందున, దాని ఉత్పత్తుల ధరలను పెంచడం కూడా మనకు అనివార్యం. అందుకే నందిని నెయ్యి ధర కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో నందిని నెయ్యిని తక్కువ ధరలకు విక్రయించకూడదని కేఎంఎఫ్ నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి పాల ధరలు పెంచడంతో నెయ్యికి ఎక్కువ ధర ఇవ్వాలని డిమాండ్ చేశామని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేశారు. 

కేఎంఎఫ్ నెయ్యికు నాణ్యత కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ ఉంది.  తిరుమలకు నెయ్యి సరఫరాను నిలిపివేయడంపై కర్ణాటకలోని బిజెపి నేతలు రెండు నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన సిద్దరామయ్య ప్రభుత్వాన్ని `హిందూ వ్యతిరేక’ చర్యగా ఎండగడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలపై పక్షపాతం ప్రదర్శిస్తోందని మండిపడుతున్నారు.

అయితే, తిరుమలకు నెయ్యి సరఫరా ఆపివేయాలని నిర్ణయం ఇంతకు ముందున్న బిజెపి ప్రభుత్వమే తీసుకుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. కర్ణాటక పాల సరఫరాదారుల సమాఖ్య నుంచి తిరుపతి లడ్డూకు నెయ్యి పంపిణీ చేసే విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, గతంలో 2021లో బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వమే కర్ణాటక నెయ్యి సరఫరా నిలిపివేసి ఇప్పుడు తనపై నిందలు వేయడం ఏమిటని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ పై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తిరుపతి లడ్డూకు నెయ్యి సరఫరా ఆపేసిన బొమ్మై హిందూ వ్యతిరేకా, హిందువులకు బీజేపీ వ్యతిరేకమా ఇప్పుడు చెప్పాలని సిద్ధరామయ్య ప్రశ్నించారు. దీంతో బీజేపీ ఇరుకునపడింది. గతంలో బీజేపీ పాలనలో మతపరమైన అంశాల్ని తెరపైకి తెచ్చి రాజకీయంగా లబ్ది పొందిన కాషాయ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్నీ అవే అంశాలతో టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

శ్రీవారి ఆలయంలో స్వామి వారికి రకరకాల ప్రసాదాలు నివేదిస్తునప్పటికీ, స్వామి వారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డూ. ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రసాదాల్లో లడ్డూను పురాణకాలం నుంచి స్వామి వారికి నివేదిస్తున్నటు తెలుస్తుంది. 1455వలో సుఖీయం, అప్పంను, 1460లో వడను, 1468లో అత్తిరసంను, 1547లో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశ పెట్టినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు..

అయితే అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభించారు. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles