తిరుమల తిరుపతి దేవస్థానాల నిర్వహణలో ఫక్తు వ్యాపార పోకడలు చోటు చేసుకుంటున్నాయి. భక్తులకు సేవ అందించడం మాత్రమే పరమావధిగా భావించవలసిన టిటిడి యాజమాన్యం భక్తులతో- దేవుడితో వ్యాపారం చేయడానికి మాత్రమే పెద్దపీట వేస్తోంది. మారుతున్న పరిస్థితులతో పాటు ధరలు పెంచడం అనేది ఎప్పుడో ఒకసారి అనివార్యంగా జరిగే విషయమే. అయితే టీటీడీ కాటేజీ ధరలను ఏకంగా 10 రెట్లు, 15 రెట్లు పెంచడం అనే దుర్మార్గమైన నిర్ణయం యావత్ రాష్ట్రాన్ని విస్తు పోయేలా చేస్తోంది.
50 రూపాయల కాటేజీ అద్దెను 750 రూపాయలకు, రెండు వందల రూపాయల కాటేజీ అద్దెని ఏకంగా 2300 రూపాయలకు పెంచుతూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు గురవుతోంది. దేవుడితో ఇంతగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కనీసం పారదర్శకమైన సేవలను అందించడం మీద కూడా కనీస శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.
తిరుమల క్షేత్రంలో కొన్ని వందల కాటేజీలు ఉంటాయి. వీఐపీలకు కేటాయించే అతిథిభవనాల సంగతి సరేసరి. అయితే ఎప్పుడూ కూడా వీటికి పాదర్శకమైన కేటాయింపు- నిర్వహణ ఉండదు. ఈ క్షణాన ఎన్ని కాటేజీలు బుక్ అయి ఉన్నాయో.. ఎన్ని ఖాళీ ఉన్నాయో తెలిపే ఏర్పాటు ఉండదు. కాటేజీల విషయంలో నిత్యం దందాలు, పైరవీలు మాత్రమే నడుస్తుంటాయి. కాటేజీలు పొందడానికి దళార్లను ఆశ్రయించి.. వారికి సొమ్ము ముట్టజెప్పి పొందేవారే ఎక్కువ. ఇదంతా కేవలం కాటేజీల కేటాయింపు విషయంలో టీటీడీ పారదర్శకత పాటించకపోవడం వల్ల మాత్రమే.
అయితే దేవదేవుడిని సేవించి తరించడానికి ఎక్కడెక్కడినుంచో పేద భక్తులు వస్తుంటారు. వారి సేవకోసం కాస్త తక్కువ ధరలకే గదులను కేటాయిస్తుంటారు. ఇది కేవలం తిరుమల విషయంలో మాత్రమే కాదు. సాధారణంగా పుణ్యక్షేత్రాల్లో ఆలయ యాజమాన్యాలకు అనుబంధంగా ఉండే అన్ని గదుల కేటాయింపులోనూ తక్కువ ధరలే ఉంటాయి. భక్తులకు గదులు ఇవ్వడాన్ని ఆలయ యాజమాన్యాలు వ్యాపారంలాగా చూడవు. సేవలాగానే భావిస్తాయి. అయితే టీటీడీ మాత్రం కాటేజీలను లాడ్జీలుగా పరిగణిస్తున్నట్టుగా ధరలు భారీగా పెంచేసింది. అనూహ్యమైన పెంపు అసలు అర్థం కావడం లేదు. 50 రూపాయల కాటేజీని 750 రూపాయలు చేయడం, 200 రూపాయల కాటేజీని ఏకంగా 2300 రూపాయలు చేయడం మరీ అరాచకంగా ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. వీటి బదులుగా.. సిఫారసు ఉత్తరాల పేరుతో పైరవీకారులు పొందే గెస్ట్ హౌసుల అద్దె ధరలను పదివేలకు, ఇరవై వేలకు పెంచేస్తే బాగుంటుందని.. వాటిలో దిగేవాళ్లంతా సంపన్నులే గనుక.. ఎవ్వరికీ భారం కూడా ఉండదని, సామాన్య భక్తులకు ఇబ్బందులుండవని ప్రజలు అంటున్నారు.
తిరుమల క్షేత్రం లాడ్జీల కేంద్రమా?
Wednesday, January 22, 2025