కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతా లోపం బయటకు వచ్చింది. భద్రతలోని డొల్లతనం వెల్లడయ్యేలా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో తరచూ టీటీడీ నిఘా సిబ్బంది వైఫల్యం బయటపడుతూనే ఉంది.
ఆదివారం రాత్రి ఓ భక్తుడు ఆనంద నిలయం వరకూ మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లాడు. గర్భగుడిని బయటి నుంచి సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులపై భక్తులు మండిపడుతున్నారు.
ఓ భక్తుడు సెల్ ఫోన్ తో గర్భగుడి దాకా వెళుతుంటే భద్రతా సిబ్బంది ఏంచేస్తున్నారని మండిపడుతున్నారు.శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ ను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇతరత్రా లగేజీని కూడా అనుమతించరు. పలు దశల్లో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
తిరుమలలో అడుగడుగునా భద్రత ఉంటుంది. ప్రతీ సందర్భంలోనూ నిఘా కొనసాగుతోంది. కానీ, మూడు అంచెల భద్రతను దాటి మరీ ఓ భక్తుడు మొబైల్ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌తో వెళ్లిన సదరు భక్తుడు శ్రీవారి ఆలయంలో హల్‌చల్ చేశాడు. ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌తో చిత్రీకరించాడు.
అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే భక్తుడు శ్రీవారి ఆలయంలో ఇంకేమైనా చిత్రికరించాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విమాన వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుతున్న దృశ్యాలతో పాటు గర్భగుడి కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇంత పకడ్భందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తుడు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరుమల విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ సదరు భక్తుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఎప్పుడు తీసారు.? ఈ ఘటన ఎలా జరిగిందనే దాని పైన అధికారులు ఆరా తీస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. టిటిడి ఉద్యోగులలో ఇతర మతస్థులపై చర్యలు తీసుకొనక పోవడం, ఇతర మతాల ప్రచారం జరుగుతున్నట్లు అప్పుడప్పుడు ఆధారాలు లభిస్తుండటం, టిటిడి ఆస్తుల నిర్వహణ విషయంలో పలు వివాదాలు తలెత్తడం, సాధారణ భక్తుల ప్రయోజనాలను పట్టించుకోకుండా అధికార పార్టీకి చేయెండినవారికి, వారి అనుచరులకు పెద్దపీట వేస్తుండటం వంటి పలు అంశాలపై హిందూ సంఘాలు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.