తిరుపతి ఎయిర్ పోర్ట్ ను రిలయన్స్ కు కట్టబెట్టేందుకు సిద్ధం!

Sunday, January 19, 2025

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో కొత్తగా మౌలిక సదుపాయాలను కల్పించక పోగా, ఉన్నట్టు లాభదాయకమైన ప్రభుత్వ రంగంలోని కీలక సదుపాయాలను బడా పారిశ్రామిక వేత్తలకు కారుచవుకగా కట్టబెట్టేందుకు సిద్దపడుతున్నారు. అందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం `జీ హుజూర్’ అంటూ వంత పాడుతున్నారు.

తాజాగా, ఏటా రూ.200 కోట్లపైనే లాభాలు వస్తోన్న తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ఎయిర్‌పోర్టులను కూడా ప్రయివేటీకరించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వికెసింగ్‌ ఇటీవల వెల్లడించారు.

టెండర్లను పిలవకుండానే తిరుపతి ఎయిర్‌పోర్టును అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కార్గో విమానాలు కూడా నడుస్తున్నాయి. ఈ ఎయిర్‌పోర్టును దక్కించుకొనేందుకు జిఎంఆర్‌, టాటా, రిలయన్స్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఈ మూడింటిలో రిలయన్స్‌ సంస్థ వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఎయిర్‌పోర్టును కారు చౌకగా దక్కించుకొని దీనిపక్కనే ఉన్న మరో 300 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా కొనుగోలు చేసి మాల్స్‌, రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లు నిర్మించే ప్రణాళికల్లో రిలయన్స్‌ సంస్థ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తిరుపతి నగరానికి కూతవేటు దూరంలో ఈ విమానాశ్రయం ఉంది. పెద్ద విమానాలు మూడు ఒకేసారి ల్యాండ్‌ అయ్యేలా స్థాయికి విస్తరణ జరిగింది. దీంతోపాటు డొమెస్టిక్‌, కార్గో విమానాలు వచ్చి వెళ్లేలా తీర్చిదిద్దారు. సాధారణ పార్కింగ్‌లో 500 కార్లను, వివిఐపి పార్కింగ్‌లో 50 కార్లను పార్కింగ్‌ చేసే అవకాశం ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో ఉంది.

పది ఆర్‌టిసి బస్సులను కూడా పార్కింగ్‌ చేయవచ్చు. తమిళనాడు, బెంగళూరు, హైదారాబాద్‌కు చెందిన కొందరి పారిశ్రామికవేత్తల, సినీతారల వ్యక్తిగత/ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఇక్కడే పార్కింగ్‌ చేస్తున్నారు. దీనివల్ల ఆదాయం కూడా ఈ ఎయిర్‌పోర్టుకు సమృద్ధిగా సమకూరుతోంది.

గతంలో ఇక్కడ డైరెక్టర్‌ పోస్టు ఉండేది. ప్రయివేటీకరణ చేయాలనే ఆలోచనలో మూడేళ్ల క్రితం డైరెక్టర్‌ పోస్టును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతవరకూ ఉన్న డైరెక్టర్‌ను ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు బదిలీ చేసింది. ప్రస్తుతం జనరల్‌ మేనేజర్‌ పర్యవేక్షణలో ఈ ఎయిర్‌పోర్టు ఉంది.

నిర్వహణ మొత్తం తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టు ఆధ్వర్యంలో నడుస్తోంది. 300 మంది ఉద్యోగులు, 200 మంది అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, 150 మంది రక్షణ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడ, చెన్నరు, బెంగళూరు, మైసూరు, హైదరాబాద్‌ల నుంచి రోజుకు 15 విమానాలు వచ్చి వెళ్తున్నాయి.

సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ మొత్తం ఖర్చులుపోను గత ఐదేళ్లగా ఏటా సుమారు రూ.200 కోట్లు లాభాలు వచ్చాయి. తాజాగా అంతర్జాతీయ విమానాలను తీసుకురావాలని స్థానిక ఎంపి గురుమూర్తి ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కువైట్‌ నుంచి తిరుపతికి విమానాలు నడుపుతామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజులకే కేంద్రమంత్రి వికె సింగ్‌ తిరుపతి ఎయిర్‌పోర్టు అమ్మకానికి పెట్టడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles