తిరుగుబాటు ధోరణిలో సస్పెండ్ చేసిన వైసిపి ఎమ్యెల్యేలు!

Sunday, January 19, 2025

ఎమ్యెల్యేల నుండి ఎమ్యెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో టిడిపి అభ్యర్థులకు ఓట్లు వేశారని ఆరోపిస్తూ పార్టీ నుండి బహిష్కరించిన నలుగురు వైసీపీ ఎమ్యెల్యేలు ఇప్పుడు పార్టీ నాయకత్వంపై ఎదురుదారికి దిగుతున్నారు. వైసీపీతో తాడోపేడో తేల్చుకుంటామంటూ వారు సవాల్ చేసే ధోరణిలో మాట్లాడుతూ ఉండటం రాజకీయ వర్గాల్లో మరింత కాక పుట్టిస్తుంది.

వారు ప్రధానంగా రెండు అంశాలపై వైసిపి నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. తాము ఒకొక్కరం రూ 20 కోట్ల వరకు డబ్బు తీసుకొని టిడిపి అభ్యర్ధికి ఓటువేశామనే ఆరోపణల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం నుంచి ఒక్కో ఎమ్మెల్యే 10 నుంచి 20 కోట్లు ముడుపులు తీసుకుని పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని గత మూడు రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ నలుగురు ఎమ్మెల్యేలు మొదట మౌనంగా ఉన్నప్పటికీ శని, ఆదివారాల్లో ఒకరు తరువాత ఒకరు మీడియా ముందుకు వచ్చి తమ గళం విప్పారు.

దమ్ముంటే తాము డబ్బులు తీసుకుని ఓటు వేశామని రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. కాణిపాకంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమేనని, అందుకు వైసీపీ సిద్ధమేనా అని శ్రీదేవి సవాల్‌ చేస్తూ ఇదే సందర్భంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ళ రాజకీయ చరిత్రగల తాను డబ్బుకు అమ్ముడుపోయేవాడినా? అంటూ ఆనం రామనారాయణ రెడ్డి చిందులు వేశారు.

సిబిఐ, ఈడీ కేసుల నుంచి, కుటుంబ సభ్యులను హతమార్చిన కేసు నుంచి బయటపడడానికి తాను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని అంటూ నేరుగా సీఎం జగన్ పైననే మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ నుండి వచ్చి, వైసిపిని ఏర్పాటు చేయడంలో జగన్ కు అండగా ఉన్న తమపై ఇప్పుడు నిందలు వేస్తారా అంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ,  మేకపాటి చంద్రశేఖ ర్‌రెడ్డి నిలదీస్తున్నారు. చాలా ఆస్తులున్న తాను రూ 20 కోట్లకు అమ్ముడు బోయేదానినా? అంటూ ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నిస్తున్నారు. అదేదో రూ 200 కోట్లు తీసుకున్నామంటే కొంచెం గౌరవంగా ఉండెడిది అంటూ ఆమె ఎద్దేవా చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనకు మద్దతుగా  శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ బలోపేతం కోసం తానే ఎదురు డబ్బులు ఇచ్చాననిమేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. నువ్వు ఏమైనా డబ్బులు ఇచ్చావా? అంటూ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తున్నారు. 

ఇక, రెండో ప్రధాన విషయం తాము వైసిపి అభ్యర్థులకు ఓటు వేయలేదని ఏ విధంగా తెలుసుకున్నారు? అంటూ పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. తాను ఓటువేసేటప్పుడు బల్ల కింద దాక్కొని చూసారా? అంటూ శ్రీదేవి నిలదీశారు. దమ్ముంటే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు రుజువు చేయాలని సవాల్ చేస్తున్నారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని అంటూ వారు వేస్తున్న ప్రశ్నలు ఒక విధంగా వైసిపి నాయకత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్నాయి.

వారు ఈ విషయమై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తే సీఎం జగన్ ఆత్మరక్షణలో పడవలసి వస్తుంది. గతంలో వైఎస్ జగన్ ను పార్టీకి శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు ప్రకటించి ఎన్నికల కమీషన్ ముందు దోషిగా నిలబడవలసి వచ్చింది. ఈ విషయమై ఎన్నికల కమీషన్ వివరణ కోరగానే అలాంటిది ఏమీ లేదంటూ అబద్దం ఆడవలసి వచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles