దేశం మొత్తం మీద తనను గౌరవించడం లేదని, అధికారులు ప్రోటోకాల్ పర్యటించడం లేదని నిత్యం అరణ్య రోజన చేస్తున్న ఏకైక గవర్నర్ డా. తమిళశై సౌందర్యరాజన్. గవర్నర్ గా వచ్చి మూడేళ్లవుతున్నా ఇంకా ఆమె ఓ బిజెపి నాయకురాలి వలే వ్యవహరిస్తున్నారని, ఓ ప్రభుత్వ అధినేతగా హుందాతనం ప్రదర్శించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.
ముఖ్యమంత్రి – గవర్నర్ ల మధ్య నిత్యం రాజకీయ వివాదాలు చెలరేగుతున్న సమయాలలో సహితం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రాజ్ భవన్ కు వెళ్లి వస్తుండటం జరుగుతుంది. ఉమ్మడిగా అధికార కార్యక్రమాలలో పాల్గొనడం చేస్తున్నారు.
కానీ, కేవలం తెలంగాణాలో మాత్రమే ఒక విధంగా కేసీఆర్ ప్రభుత్వం `రాజ్ భవన్’ ను బహిష్కరిస్తున్నట్లు వ్యవహరిస్తున్నది. ఈ విషయమై ఆమె ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకపోయింది. పైగా, ప్రధాని పర్యటనలకు సహితం కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు.
గత వారం వేసవి విడిదగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదురోజుల పర్యటనకు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు గవర్నర్ తో పాటు అన్ని అధికార కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ కూడా భద్రాచలం, యాదాద్రి వంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆమెతో పాటు డా. తమిళశైకు సహితం మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు.
హకీంపేట్ ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం కేసీఆర్ స్వాగతం పలికిన సమయంలో గవర్నర్ తో సహితం మాటా మంతి కలిపారు. దానితో ఇద్దరు మాట్లాడుకోవడంతో ఇక నుంచి ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య అంతరం తొలగిపోయినట్లేనని అందరూ అనుకున్నారు. కానీ.. షెడ్యూల్‌లో లేదనే కారణంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ విందుకు సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం గవర్నర్‌తో దూరం కొనసాగుతుందనే సంకేతాలకు కారణమైంది.
కానీ కొద్ది మంత్రి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇటీవల కాలంలో రాజ్ భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులు సందడి చేయడం ఇదే కావడం గమనార్హం. రాష్ట్రపతికి వీడ్కోలు సమయంలో కూడా కేసీఆర్ లేరు. ఏదేమైనా రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రాజ్ భవన్ తో పాటు గవర్నర్ జరిపిన పర్యటనలు సందడిగా జరుగగా, నూతన సంవత్సరం సందర్భంగా తిరిగి రాజ్ భవన్ బోసిపోయింది.
సాధారణంగా కొత్త సంవత్సరం రోజున ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు గవర్నర్ కు శుభాకాంక్షలు తెలపడం సంప్రదాయంగా వస్తున్నది. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఈ సంప్రదాయంపై కేసీఆర్ ప్రభుత్వం దూరంగా ఉంటూ వస్తున్నది. ఇప్పుడా భయం లేకపోయినా ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. రాజ్‌భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించ లేదు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కేంద్ర సహకారం వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందని గవర్నర్ తమిళిసై తెలిపారు. కేంద్రం సకాలంలో టీకాలు ఇవ్వడంవల్లే కరోనా కట్టడి అయిందని అంటూ కరోనా కట్టడిలో టీఎస్ సర్కార్ చేసిన అంశాలను గవర్నర్ ప్రస్తావించారు. ఆ విధంగా ఆమె ఏమి మాట్లాడినా కేంద్ర ప్రభుత్వ ప్రచార సారధిగా ఉంటున్నారు తప్పా, ఓ రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటున్న హుందాతనం ప్రదర్శించడం లేదనే అసంతృప్తి రాష్ట్రంలోని అధికార పక్ష నేతలలో వెల్లడి అవుతున్నది.