ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అని సామెత. అందుకే తమ నాయకుడు ఏంచేస్తే ఆయన సచివులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కాకపోతే.. నాయకుడి దృష్టిలో పడాలని కోరుకుంటుంటారు గనుక.. ఇంకాస్త ఘాటుగా పయనిస్తున్నారు. తమలపాకుతో ఒకటి వడ్డించమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే.. తలుపుచెక్కతో పది తగిలించమని మంత్రి దాడిశెట్టి రాజా అంటున్నారు. ప్రభుత్వం మీద విమర్శలు వస్తే ప్రెస్ మీట్లు పెట్టు గట్టిగా తిట్టండి.. అని జగన్ కలెక్టర్ల సమావేశంలో మార్గదర్శనం చేసిన సంగతి తెలిసిందే. తన స్థాయికి తగ్గట్టుగా వాలంటీర్లు, పార్టీ కన్వీనర్లతో సమావేశంపెట్టుకున్న మంత్రి దాడిశెట్టి రాజా అప్పుల గురించి మాట్లాడితే చెప్పుతో కొట్టాలని వారికి గైడెన్స్ ఇస్తున్నారు. ప్రభుత్వం మీద విమర్శలు సంధించే మీడియాను తిట్టాలని సీఎం చెబితే, సర్కారీ అప్పుల ప్రస్తావన తెచ్చే ప్రజలనే చెప్పుతో కొట్టాలని మంత్రిగారు రెచ్చిపోతున్నారు. సమాజానికి వీరు ఏం సంకేతాలు ఇస్తున్నారు?
ఎన్నికలు ఇంకా దగ్గర పడలేదు. ఇంతలోనే అన్ని పార్టీలు చాలా ముమ్మరంగా తమ రణవ్యూహాలను సిద్ధంచేసుకుంటున్నాయి. జగన్ కూడా వ్యూహరచనలో మునుగుతున్నారు. అదే సమయంలో తరచుగా అసహనానికి గురవుతున్నారు. ఆయనకు తగ్గట్టుగానే ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలలో కూడా అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. కాకపోతే కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీ మీదనే ఆ అసహనాన్ని వెళ్లగక్కుతోంటే.. మరికొందరు ప్రతిపక్షాల మీద ప్రజల మీద చూపిస్తున్నారు.
నాలుగేళ్లలో ఒక్క పని కూడా జరగలేదని.. ఓట్లు అడుగుతూ ప్రజల వద్దకు వెళ్లగల అధికారమే లేదని ఒక ఎమ్మెల్యే అసహనం చూపిస్తే మరొకరు ప్రజలను చెప్పుతో కొట్టాలంటున్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే సంగతి మంత్రి దాడిశెట్టి రాజాకు తెలియదా? మూడున్నరేళ్లలో తమ ప్రభుత్వం కేవలం 1.3 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్న మంత్రి దాడిశెట్టి.. అది చాలా తక్కువ అప్పు మాత్రమే.. అనే సంగతిని అప్పుల గురించి ప్రశ్నించిన వారికి తెలియజెప్పమని వాలంటీర్లకు ఉద్బోధిస్తే సరిపోతుంది కద.
ప్రభుత్వం గొప్పగానే పనిచేస్తోందని మంచి మాటలతో చెప్పి ప్రజాభిమానాన్ని కూడగట్టుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ.. మంత్రి దాడిశెట్టి రాజా మాత్రం.. ప్రజలను చెప్పుతో కొట్టి మరీ తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నట్టున్నారు. దానికి తగ్గట్టుగానే వాలంటీర్లకు, పార్టీ సచివాలయ కన్వీనర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు.
తిట్టమంటారు.. చెప్పుతో కొట్టమంటారు..
Friday, November 15, 2024