కాంగ్రెస్ తో విభేదించి, బైటకు వచ్చి వైసిపి ఏర్పాటు చేసిన్నప్పటి నుండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ, ఆ పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక వహించిన నేతలు ఒక్కరొక్కరు తెరమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటగా, జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని ముందుండి నడిపించిన చెల్లెలు వైఎస్ షర్మిలపై `వేటు’ పడింది. ఆమె దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది.
ఇటీవలనే, పార్లమెంటరీ పార్టీ నేతగా నం 2 గా వెలుగొందిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం దాదాపు ఎటువంటి పాత్రలేనివారుగా ఉన్నారు. అంతకు ముందు పార్టీపై మొదటగా `తిరుగుబాటు’ ఎగరవేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సహితం జగన్ కు సన్నిహితంగా వ్యవహరించినవారే కావడం గమనార్హం. జగన్ కు మొదటి నుండి సన్నిహితంగా ఉంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి సహితం మౌనంగా ఉండవలసి వస్తుంది.
ఇక, ఈ మధ్య జగన్ కు దూరం జరుగుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి జగన్ `ప్రాణం’ పోసినవారు సహితం దూరంకాక తప్పడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ లో అధికార పోరులో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న జగన్ శ్రీమతి వైఎస్ భారతి వ్యూహంలో భాగంగానే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న అక్రమార్జనకు సంబంధించిన సిబిఐ, ఈడీ కేసుల విచారణ నత్తనడక నడిచే విధంగా గత ఏడెనిమిదియేళ్ళుగా వ్యూహాత్మకంగా చేసుకుంటున్న్నారు. అయితే, వాటి విచారణ ఎప్పటికైనా వేగం అందుకుంటే, ఆయన తిరిగి జైలుకు వెళ్ళక తప్పదనే అభిప్రాయం వైసిపి కీలక నాయకులు అందరిలోనూ ఉంది.
అందుకనే, ఆయన సీఎం పదవి చేపట్టిన్నప్పటి నుండి ఒకవేళ జైలుకు వెళ్ళవలసి వస్తే, సీఎం కూర్చులో ఎవ్వరు ఉండాలనే విషయమై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో జగన్ వారసత్వంకు ఎవ్వరూ పోటీ రాకుండా ఉండేందుకు భారతి, ఆమె మద్దతుదారులు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులే ఈ పరిణామాలకు దారితీస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
చివరకు అజయ్ కళ్లెం వంటి అధికారులను సహితం దూరంగా నెట్టివేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం `డిఫెక్టో’ సీఎంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి నుండి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వరకు వైఎస్ భారతికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నవారే అక్కడ అధికారం చెలాయిస్తున్నారు.
ఈ పరిణామాలతో విసుగు చేసిన జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ సహితం ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చేశారని, వచ్చేటప్పుడు `జాగ్రత్త నాయనా’ అంటూ కొడుకుకు చెప్పి వచ్చారని అంటున్నారు.