తాడిపత్రిలో టీడీపీ – వైసీపీల మధ్య ఫ్లెక్సీల పోరు

Sunday, December 22, 2024

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలో టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీల వార్ మరింత ముదిరింది. ఇరు వర్గాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఈ పరిణామం తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది.

టిడిపి నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డికి వ్యతిరేకంగా ప్రధాన కూడళ్ళలో ఫ్లెక్సీలు వెలిశాయి. డీజిల్ దొంగ ఎవరంటూ ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించి, ఫ్లెక్సీలో ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోటోపై ముద్దుల వర్షం కురిపించడంతో రాజకీయ దుమారం చెలరేగింది.

ప్రజా సొమ్మును దోచుకుంటున్నది నువ్వంటే నువ్వు అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో డీజిల్ ఇష్టానుసారంగా సొంతానికి వాడుకొని కోట్ల రూపాయలు దిగమింగారంటూ ఇద్దరు నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీలు తయారుచేసి పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు కట్టించారు.

దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. అయితే ఒక ఫ్లెక్సీని  ప్రభాకర్ రెడ్డి తన ఇంటి వద్దకు తీసుకెళ్లి నిరసన చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గజదొంగ అని విమర్శించడమే కాకుండా, తన గుండెల్లో తాడిపత్రి ప్రజలు ఉన్నారని చొక్కా విప్పి ప్రదర్శించారు. పెద్దారెడ్డి ఫోటోను ముద్దాడారు.

ఈ ఫ్లెక్సీలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ  కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫొటో చూపుతూ ఇద్దరం దొంగలమేనని అన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న పెద్దారెడ్డి అంటూ ఫ్లెక్సీకి ప్రభాకర్ రెడ్డి ముద్దులు పెట్టారు. ప్రజల మనసు దొచుకున్న గజదొంగ తానే అంటూ ప్రభాకర్ రెడ్డి చొక్కా విప్పి తన గుండెను చూపించారు.

‘నువ్వు, నేను ఇద్దరూ దొంగలే.. నువ్వు గజదొంగ.. ప్రజల సొమ్మును దొచుకున్న గజదొంగ నువ్వు.. నేను తాడిపత్రి ప్రజల మనసును దోచుకున్న దొంగను.. నా గుండె ఎప్పుడూ తాడిపత్రి.. తాడిపత్రి అనే కొట్టుకుంటుంది. ఒకసారి చూడరా బుడ్డోడా.. నువ్వు తాడిపత్రి మొత్తాన్ని దోచేస్తున్నావ్.. నీకు సిగ్గు లేదా..? రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది.. ఆ సమయంలో డీజిల్ ఏం చేశారో సమాధానం చెప్పు?” అంటూ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.

ఫ్లెక్సీలు తాను కడతానని అంటూ గజదొంగ ఎవరో తేల్చాలంటూ కేతిరెడ్డికి సవాల్ విసిరారు. ఎన్ని ఫ్లెక్సీలు వేయించినా నిన్ను జనం నమ్మరు. ఇంకా ఏడాది ఉంది.. దోచుకో దాచుకో.. నా గుండెల్లో తాడిపత్రి తప్ప మరొకటి లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles