రకరకాల హామీలను ప్రకటించడం ద్వారా, ఎప్పటికైనా సరే.. అనివార్యంగా ఏర్పాటుచేయక తప్పించుకోలేని 12వ పీఆర్సీని నియమించడం ద్వారా.. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయేమోనని జగన్ సర్కారు భావించినట్టుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ముందరి కాళ్లకు బంధాలు వేయడం మీదనే బోలెడంత అసంతృప్తి రేగుతోంది. ఇవి చాలవన్నట్టుగా ప్రభుత్వానికి వదలని తలనొప్పిగా.. జీపీఎస్ వ్యవహారం రావణకాష్టంలాగా రగులుతూనే ఉంది.
ఉద్యోగ సంఘాల నేతలందరితో కలిసి సీఎస్ జవహర్ రెడ్డి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగసంఘాల నుంచి 461 డిమాండ్లు ప్రభుత్వం ముందుకు రాగా, అందులో 341 నెరవేర్చామని సీఎస్ లెక్కలు చెప్పారు. అయితే ఆ లెక్కల ఉద్యోగసంఘాల ప్రతినిధుల్ని సంతృప్తి పరచలేకపోయాయి. రాష్ట్రంలో జీతాల చెల్లింపులో జరుగుతున్న అలవిమాలిన జాప్యాన్ని ఉద్యోగసంఘాల నేతలు ప్రశ్నించారు. జీతాలు, పింఛన్లు ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తేదీనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఏ, పీఆర్సీ బకాయిలు అన్నీ ఈ ఏడాది డిసెంబరులోగా చెల్లింపు పూర్తిచేయాలని కూడా వారు కోరారు.
అదే సమయంలో పాత పెన్షను విధానాన్ని మళ్లీ అమలు చేసి తీరాల్సిందేనంటూ.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గట్టిగా పట్టుబట్టడం గమనార్హం. ఓపీఎస్ అసలు సాధ్యం కాదని అంటూ.. అందరికీ అనుకూలంగా ఉండేలా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకువస్తాం అని గతంలో ప్రభుత్వం చెప్పింది. అయితే, అప్పట్లో దీనికి అంగీకరించడం వలన ఉద్యోగుల ఎదుట తాము విలువ కోల్పోయాం అని సంఘాల నాయకులు ఈ సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన విధంగా ఓపీఎస్ ను అమలు చేసి తీరాల్సిందేనని, మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించేది లేదని వారు వెల్లడించారు. ప్రభుత్వం జీపీఎస్ ఇస్తాం అనే మాట చెప్పి చాలా కాలం గడిచినప్పటికీ ఇప్పటిదాకా కనీసం విధివిధానాలు కూడా రూపొందించలేదని ఉద్యోగసంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. జీపీఎస్ అనే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఒకసారి నేతలు దానికి ఒప్పుకున్న తర్వాత.. వీలైనంత త్వరగా విధివిధానాలు రూపొందించి ఉంటే బాగుండేది. అడుగు ముందుకు పడకుండా.. మాయమాటలతో వారిని బుజ్జగించాలని అనుకోవడం వల్ల సమస్య మరింత పీటముడి పడుతోంది.