తమ్ముడు పవన్ కు మద్దతుగా వచ్చి చిక్కులో పడ్డ చిరంజీవి!

Sunday, January 19, 2025

జనసేన పార్టీ అధినేతగా `వైసిపి విముక్త ఏపీ’ కోసం అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిత్యం విరుచుకు పడుతున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అన్నట్లు మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి జగన్ ప్రభుత్వంను లక్ష్యంగా చేసుకొని చేసిన వాఖ్యలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.

తమ్ముడు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నా, నిత్యం పవన్ పై జగన్, ఆయన మంత్రులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న ఏనాడూ పెదవి విప్పని చిరంజీవి ఒక విధంగా జగన్ ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. సినిమా పరిశ్రమ పెద్దగా కొన్ని సందర్భాలలో సీఎం జగన్ ను కూడా కలిశారు.

ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు చేటు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నా, తమ్ముడు పవన్ ను ఇబ్బందికి గురిచేసే విధంగా చేస్తున్నా ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. పైగా, ప్రజారాజ్యం పార్టీకి ఎంతోమంది ఆయన వెంట నడిస్తే, పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్ర మంత్రి పదవితో సరిపెట్టుకున్న ఆయన ధోరణినిని ఇప్పటికీ ఆయన అభిమానాలు జీర్ణించుకోలేక పోతున్నారు.

దానితో ఆయనకు తన `వ్యాపార’ ప్రయోజనాలు తప్ప మరేమి పట్టదనే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు తమ్ముడిని లక్ష్యం చేసుకొని వైసిపి నేతలు చేస్తున్న విమర్శలకు స్పందిస్తున్నట్లుగా “సినీ నటుల రెమ్యునరేషన్ గురించి మీకెందుకు ప్రజలకు మంచి చేస్తే పదికాలాల పాటు గుర్తుంచుకుంటారు” అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపుతున్నాయి.

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబును పోలిన పాత్రను చిత్రించడంపై రాజుకున్న వివాదంతో మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో పవన్ సినిమా రెమ్యునరేషన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇటీవల అంబటి ఫిర్యాదు చేశారు. 

దీనికి కొనసాగింపుగా రెండ్రోజుల క్రితం చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్లో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఆయనను లక్ష్యంగా చేసుకొని మాటల దాడులు చేస్తున్నారు. నటీనటుల రెమ్యునరేషన్ గురించి మీకెందుకు ప్రజలకు మంచి చేయండి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి చివాట్లు పెట్టడంపై ఘాటుగా స్పందిస్తున్నారు.

‘మీలాంటివాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగ- ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి’ అని పరోక్షంగా వైసీపీ నాయకులను ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 200 రోజుల వేడుక సందర్భంగా సోమవారం రాత్రి ఈ వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసి, విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మాట్లాడని మనిషివంటూ దుమ్మెత్తిపోశారు. 2018వరకు ఎంపీగా ఉన్నా చిరంజీవి ఏం చేశాడని నిలదీశారు.

తాను చిరంజీవి అభిమానిగా చెబుతున్నానంటూ మాజీ మంత్రి పేర్ని నాని చురకలు అంటించారు. సినిమాను సినిమాగ, రాజకీయాలను రాజకీయంగా చూడాలని హితవు పలికారు. రాజకీయాల్లో దాడి చేస్తే ఎదురుదాడి ఖాయమని హెచ్చరించారు. దృతరాష్ట్రుడికి తన కుమారులపై ప్రేమ ఉంటే ఎలా నష్టం జరిగిందో,  అలాంటి ప్రేమ ఉంటే ఇప్పుడూ నష్టం జరుగుతుందని వారించారు. సినీ పరిశ్రమ ‘పిచ్చుక’ వంటిదని చిరంజీవి అంగీకరిస్తున్నారా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. సినిమాపై ఎందుకు పని చేస్తుందని ప్రశ్నించారు.

‘రాష్ట్రానికి అన్యాయం చేసినవారిలో చిరంజీవి ఒకరని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. పార్టీ పెట్టి ఎత్తేసి వెళ్లిపోయిన ఆయనకు మళ్లీ రాజకీయాలు ఎందుకని వ్యాఖ్యానించారు.  తమ్ముడు పవన్‌కల్యాణ్‌పై అభిమానం ఉంటే ఆయనకు మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించుకోవాలని ఎద్దేవా చేశారు. చిరంజీవి రాజకీయాలను కడిగే ముందు ఆయన తన తమ్ముణ్ని కడిగితే మంచిదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విశాఖలో సూచించారు.

మరోవైపు చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పాలని కోరారు. తన తమ్ముడికి మంచి చెప్పుకోవాలని చెప్పారు. “పవన్ సినిమాలో నా క్యారెక్టర్‌ పెట్టాడా లేదా? నన్ను తిట్టే ప్రయత్నం చేశాడా లేదా?” అని ప్రశ్నించారు. చిరంజీవి అంటే గౌరవం ఉందని, చిరంజీవి పీఆర్పీ పెట్టి రాజశేఖరరెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసినా ఆయనంటే తనకు గౌరవం ఉందంటూ నర్మగర్భంగా మాట్లాడారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles