తన గోతిని తానే తవ్వుకున్న వైసీపీ

Sunday, November 17, 2024

ప్రజలు నిజంగా ఓట్లు వేసేలాగా రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరిగితే.. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిచోటా పరాభవమే! ఒక్క పశ్చిమ రాయలసీమ నియోజక వర్గంలో మాత్రం సుదీర్ఘమైన ఊగిసలాట తర్వాత కూడా పరాజయం తప్పలేదు.  ఈ ఫలితాలను గమనించినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తన గోతిని తానే తవ్వుకుంటూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవును ప్రజలకు డబ్బు పంచిపెట్టడం మాత్రమే సంక్షేమం అనే నిర్వచనంతో పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సదరు డబ్బు పంచే పథకాల ద్వారా ఎంత మంది అభిమానులను సంపాదించుకుంటున్నదో అంతకంటే ఎక్కువగా శత్రువులను కూడా తయారు చేసుకుంటున్నది. డబ్బు పంచే ప్రభుత్వ పథకాల ద్వారా పదిలమైన ఓటు బ్యాంకును నిర్మిస్తున్నాం అనే వారి భావన కొంతమేరకు కరెక్టే కావచ్చు అదే సమయంలో డబ్బు నేరుగా అందే పథకాల కోవలోకి రాని ప్రతి వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ద్వేషించే వాతావరణం ఏర్పడుతుంది.

సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంజాయిషీల్లోనే ఈ విషయం మనకు అర్థమవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో మొత్తం మూడుుకు మూడు స్థానాలనూ కోల్పోయి దారుణమైన అవమానాన్ని దిగమింగుకుంటూ ఆ పార్టీ నాయకులు రకరకాల మాటలు చెబుతున్నారు. మేం సంక్షేమపథకాలు అమలుచేస్తున్న కోవలోకి ఈ పట్టభద్రులు రారు. అందువల్ల ఫలితం తేడా కొట్టింది అని వారంటున్నారు. ఇది అతి పెద్ద ఆత్మవంచన. పైగా ఆ పట్టభద్రుల ఓట్లు మాకు సార్వత్రిక ఎన్నికల్లో కూడా అవసరం లేదు అనేలా ధ్వనిస్తున్న అహంకారం కూడా.  

ఈ పాయింటు కరెక్టే అనుకుంటే.. వారు ఇంకా ప్రమాదంలో పడినట్టే లెక్క. రాష్ట్రంలో యాభైశాతం ఓటర్లకు ఈ ప్రభుత్వం డబ్బులు పంచిపెట్టడం లేదు కదా.. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ద్వారా డబ్బు పొందడం లేని ఏ ఒక్కరూ తమకు ఓటు వేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నదా? ఆ పార్టీ నాయకులు సమర్థించుకుంటున్న తీరు అలాగే అనిపిస్తోంది.

కానీ.. ప్రభుత్వం ద్వారా డబ్బు పొందుతున్న ప్రతి ఒక్కరూ సమానంగా హేపీగా ఉంటారని అనుకుంటే అది వైసీపీ భ్రమ. పథకాలు ఏవైనా సరే.. తమ పొరుగింటితో పోల్చుకుని.. తమకు తక్కువ డబ్బులు ప్రభుత్వం ఇస్తే ఆ కారణంగా ప్రభుత్వం మీద ద్వేషం పెంచుకునే వారు కూడా ఉంటారు. ఇలా డబ్బు పొందుతున్న వారిలో కూడా.. పాలకపక్షానికి శత్రువులు తయారైతే అది అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. అలాంటి కొత్త శత్రువులు రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని.. ప్రభుత్వ అభీష్టానికి భిన్నంగా డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి.. పట్టభద్రులు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తూ.. జాగ్రత్త పడితే వారికే మంచిది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles