తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై చిందులేస్తున్న అవినాష్ రెడ్డి

Saturday, January 18, 2025

తెలుగు రాస్త్రాలలో రాజకీయంగా సంచలనాలు సృష్టిస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆదివారం ఆయన తమ్ముడు, తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడం, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్  కు పంపడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చిందులేస్తున్నారు.

తన సోదరి, వివేకానందరెడ్డి కుమార్తె డా. వైఎస్ సునీత ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో కుమ్మక్కై తన తండ్రిని ఈ కేసులో ఇరికించారంటూ తీవ్రమైన ఆరోపణ చేశారు. వారిద్దరికీ తోడుగా మాజీ మంత్రి డా. డీఎల్ రవీంద్రరెడ్డి కూడా తమ కుటుంబం పైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆదివారం ఉదయమే సిబిఐ అధికారులు హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లగా, అక్కడ కనిపించని ఆయన మధ్యాహ్నంకు పులివెందులకు చేరుకొని తన తండ్రి అరెస్ట్ ను తాము ఉహించలేదంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తననే అరెస్ట్ చేయవచ్చంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ  సిబిఐ కీలకంగా భావిస్తున్న విధంగా ఈ హత్యకేసులతో తనకు కానీ,  తన తండ్రి కానీ ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు.

ఈ కేసును మొన్నటి వరకు దర్యాప్తు చేసిన సిబిఐ ఎస్పీ తమ కుటుంబాన్ని దోషులుగా చూపే ప్రయత్నం చేయగా, సుప్రీంకోర్టు చొరవతో ఓ డిఐజి స్థాయి అధికారితో ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేయడంతో, సిబిఐ దర్యాప్తు తీరు మారుతుందనుకొంటే నిరాశే ఎదురైనదని, పాత మార్గంలోనే వెడుతున్నదని ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాత అధికారులు చేసిన తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని అంటూ తాము లేవనెత్తిన కీలక అంశాలపై సీబీఐ స్పందించట్లేదని విమర్శించారు. విచారణను సీబీఐ అధికారులు, సునీత ప్రత్యేక కోణంలో తీసుకెళ్తున్నారని పేరొక్నటు వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలని, వ్యక్తుల లక్ష్యంగా కాదని అంటూ సిబిఐ దర్యాప్తు తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకా కేసులో సీబీఐ విచారణ సరిగ్గా జరగట్లేదు. వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలి. నాన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై మాట్లాడటానికి మాటలు రావట్లేదు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను ఊహించని విధంగానే అరెస్ట్ చేశారు. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం’ అని స్పష్టం చేశారు.

`విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసింది.. సిల్లీ విషయాలతో వ్యక్తులే లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతోంది. హత్య విషయం నాకంటే ముందే వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ముందే తెలుసు. హత్యకు సంబంధించి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..?. సమాచారం ఇచ్చిన నన్నే దోషి అంటున్నారు. సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయి’ అంటూ విమర్శలు గుప్పించారు.

పైగా,తాము  చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించడం లేదని అంటూ  హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. సీబీఐ సహకరించి బెయిల్ ఇప్పించిందని అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. వివేకానందరెడ్డి రాసిన లెటర్ అక్కడే ఉంది. లెటర్ దాచిపెట్టమని వివేకా అల్లుడు చెప్పారు. ఏప్రిల్ 3న మా అభ్యంతరాలను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సమాచారం దాచినా తప్పు కాదు, లెటర్ దాచి పెట్టామన్నా తప్పుకాదు’ అంటూ దర్యాప్తు తీరును నిలదీశారు.

`పోలీసులు రావద్దు అని నేను చెప్పానని అనడం దారుణం. వివేకా రెండో భార్యకు షహెన్‌షా అనే కుమారుడు ఉన్నాడు. షేక్ మహ్మద్ అక్బర్‌గా 2010లో వివేకా పేరు మార్చుకున్నారు. రెండో భార్యకే ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. దానికి సంబంధించిన రౌండ్ సీల్స్, పత్రాలు వివేకా ఇంట్లో దొరికాయి. స్టాంప్ పేపర్లు పోతే ఎందుకు విచారణ జరపడం లేదు’ అంటూ ప్రశ్నించారు.

ఇలా ఉండగా, ఈ అరెస్ట్ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వాఖ్యలు వైసిపి శ్రేణులను గందరగోళంకు గురిచేస్తున్నాయి. చట్టం తనపని తాను చేసుకుపోతోందని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన తేల్చి చెప్పారు. దోషులు ఎవరైనా బయటకు రావాల్సిందేనని పేర్కొన్నారు. అసలు ఆ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది సీఎం జగనే కదా? అని ప్రశ్నించారు మంత్రి సురేష్. దీంతో ఆయన ఏ కోణంలో వ్యాఖ్యలు చేశారని వైసీపీ అభిమానులు షాక్ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles