ఢిల్లీ లిక్కర్ స్కాంలో తదుపరి కవిత అరెస్ట్?

Wednesday, January 22, 2025

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ అగ్రనేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ కావడంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దానితో తదుపరి అరెస్ట్ ఎవ్వరని తెలుగు రాష్ట్రాలలో కలవరం కలుగుతుంది. ఈ సందర్భంగా అందరి చూపు సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితపైనే పడుతున్నది.

ఇప్పటి వరకు ఈ కుంభకోణం గురించి బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయని మంత్రి కేటీఆర్ మొదటిసారిగా సిసోడియా అరెస్ట్ ను ఖండిస్తూ ప్రకటన చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ.. బుచ్చిబాబు,గౌతమ్ మల్హోత్రా సహా పలువురిని అరెస్ట్ చేసింది. ఇప్పటివరుకు 12 మందిని ఈ కేసులో అరెస్ట్ చేయగా, త్వరలో మరి కొందరూ అరెస్ట్ అవుతారన్న ప్రచారం వినిపిస్తోంది.

 ఈ కుంభకోణంపై కేంద్ర బిందువుగా భావిస్తున్న సౌత్‌ గ్రూప్‌ను ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత, వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు మాగుంట రాఘవ నడిపించారని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నది. ఈ స్కామ్‌లో ఇప్పటివరకు అరెస్టుయిన వారిలో కవిత సన్నిహితులైన బోయినపల్లి అభిషేక్, అరుణ్​ రామచంద్ర పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్​ బుచ్చిబాబును కూడా సీబీఐ అరెస్టు చేసింది.

సిసోడియా అరెస్ట్ తర్వాత ఇంకెవరు అరెస్ట్ అవుతారనే దానిపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎమ్మెల్సీ కవితను ఈ స్కామ్‌​లో సాక్షిగా సీబీఐ విచారించింది. కేసులో నిందితులుగా పేర్కొంటున్న వారి రిమాండ్​ రిపోర్టులు, దాఖలు చేసిన చార్జీ షిట్‌లో కవిత పేరు ప్రస్తావించారు.

కవితను సీబీఐ గతేడాది డిసెంబరు 11న లిక్కర్ స్కాంలో ఒక సాక్షిగా ప్రశ్నించడం సంచలనంగా మారింది. అది ముగిసిన వెంటనే సీఆర్‌పీసీలోని సెక్షన్ 191 ప్రకారం మరో నోటీసు జారీ చేయడం చర్చకు దారితీసింది. ఆ తర్వాత వచ్చిన చార్జిషీట్లలో కవిత పేరును సీబీఐ, ఈడీ పదేపదే ప్రస్తావించడం జరిగింది.

అంతేకాకుండా, మొబైల్ల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఆరోపించడం, కిక్ బ్యాక్‌‌ల పేరుతో ముడుపులు ఇవ్వడం, వైన్ షాపులకు లైసెన్సులు పొంది లాభాలు ఆర్జించడం, పాలసీ రూపకల్పనలోనే కవితతో పలువురు చర్చలు జరపడం.. ఇలా అన్నింటిలో ఎమ్మెల్సీ ప్రమేయం ఉందన్న అనుమానాలను బలపరిచినట్లయింది. సౌత్ గ్రూప్ నుండి ఆప్ కు గోవా ఎన్నికల ప్రచారంపై రూ 100 కోట్లు సమకూర్చిన బృందంలో ఆమె పేరు ప్రముఖంగా పేర్కొంటున్నారు.   

ఇలా ఉండగా, మనీష్  సిసోడియాలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ త్వరలోనే అరెస్టు చేస్తుందని బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సోమవారం స్పష్టం చేశారు. చాలా అర్జుల నుండి ఈ కేసులో కవిత అరెస్ట్ కావడం ఖాయం అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles