వచ్చే ఏడాది ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ ను ఎట్లాగైనా ఓడించేందుకు బిజెపిని తమ దారిలోకి తెచ్చుకునేందుకు ఒకవంక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తమదైన రీతిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేటి నుండి మూడు రోజులపాటు జరుపనున్న ఢిల్లీ పర్యటనలో కేంద్రంలోని పెద్దలతో కీలక మంత్రాంగం జరుపనున్నట్లు తెలుస్తున్నది.
28న జరిగే నీటి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెడుతున్న జగన్ మూడు రోజుల పాటు అక్కడే ఉంది ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తదితరులతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఎన్డీయేలో అధికారికంగా భాగస్వామి కాకపోయినప్పటికీ వైసిపి ప్రభుత్వం పట్ల, జగన్ పట్ల కేంద్రం సానుకూల సంకేతాలు ఇస్తూ వస్తున్నది.
తొమ్మిదేళ్ల క్రితం నాటి బడ్జెట్ లోటు నిధులను ఇప్పుడు కేవలం రెండు రోజులలో విడుదల చేయడం, నిబంధనలను అధిగమించి రుణాలు సేకరించేందుకు అనుమతులు ఇస్తుండడంతో పాటుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో సిబిఐ ఆడుతున్న దొంగాట అంటా గమనిస్తున్న వారికి జగన్ – మోదీ బృందాల మధ్య గట్టి బంధం ఏర్పడినట్లు స్పష్టం అవుతుంది.
అందుకనే టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడిగా పోటీ చేసే అవకాశం లేకుండా జగన్ ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను `బ్లాక్ మెయిల్’ చేసైనా సరే టిడిపితో పొత్తు పెట్టుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టిడిపితో ఎట్టి పరిస్థితుల్లో బిజెపి పొత్తు పెట్టుకునే అవకాశం లేకుండా ఇప్పటికే జగన్ చేయగలిగారని ప్రచారం జరుగుతుంది.
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 ప్రతిపక్షాలు సంయుక్త ప్రకటన చేసిన వెంటనే వైఎస్ జగన్ భవనం ప్రారంభిస్తున్న ప్రధానిని అభినందిస్తూ ట్వీట్ చేయడంతో పాటు, ప్రతిపక్షాల చర్యను తప్పుబట్టడం ఈ సందర్భంగా గమనార్హం. రాజకీయ విబేధాలను పక్కన బెట్టి ఈ కార్యక్రమంకు హాజరు కావాలని స్వయంగా పిలుపిచ్చారు. జగన్ ఈ విధమైన పిలుపు ఇచ్చిన తర్వాతనే కొందరు బిజెపి నాయకులు ప్రతిపక్షాలకు అటువంటి పిలుపు ఇవ్వడం గమనార్హం.
పైగా, స్వయంగా ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. తద్వారా జాతీయ స్థాయిలో అవసరమైనప్పుడు బీజేపీ ప్రభుత్వానికి తాను కొండంత అండగా ఉంటానని స్పష్టమైన సంకేతం జగన్ ఇచ్చినట్లయింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపికి పెద్ద మొత్తంలో ఎన్నికల నిధులను సమకూరుస్తున్నారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాలలో జరుగుతోంది.
ఏదేమైనా కేంద్రంలో పలువురు బీజేపీ ముఖ్యమంత్రులకు మించి పలుకుబడి సంపాదించగలుగుతున్న జగన్ 2024 ఎన్నికలకు సంబంధించి బిజెపి అధిష్టానంతో కలిపే ఎత్తుగడలకు సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.