ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌ను మాకివ్వండి అని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు పట్టుబడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు.
దీనిపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగినా తెలంగాణ ప్రతిపాదనలను ఏపీ తిరస్కరించడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఏపీ భవన్ సముదాయంలోని భవనాలను రెండు రాష్ర్టాలు ఉపయోగించుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ విభజనపై ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు.
న్యూఢిల్లీలో ఇండియాగేట్‌కు అత్యంత సమీపంలో సుమారు రూ 1.5 లక్షల కోట్ల విలువ చేసే సుమారు 20 ఎకరాల స్థలాన్ని పంచుకునే విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటికీ ఈ పంచాయితీ తేలడం లేదు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాల సంయుక్త కార్యదర్శి సంజీవ్‌కుమార్ జిందాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం దాదాపు అరగంటపాటు కొనసాగింది. తెలంగాణ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.. ఏపీ నుంచి ఎస్‌ఎస్ రావత్, ఏపీ రీఆర్గనైజేషన్ సెక్రటరీ ప్రేమ్‌చంద్రారెడ్డి, రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్‌దాస్, ఏఆర్సీ హిమన్షు కౌశిక్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న ప్రకారం రాష్ట్రం వెలుపల ఆస్తులను సైతం 58:42 నిష్పత్తిలో పంచాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. విభజన చట్టంలోని సెక్షన్ 66 కూడా ఇదే విషయం చెబుతోంది.
ఈ లెక్కన మొత్తం 19.73 ఎకరాల స్థలంలో తెలంగాణకు 8.41 ఎకరాలు (41.68%) భూభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11.32 ఎకరాల (58.32%) స్థలాన్ని పంచాల్సి ఉంటుంది. అయితే, మొత్తం 19.73 ఎకరాల స్థలాన్ని తమకే అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది.
నిజాం ఆస్తి ‘హైదరాబాద్ హౌజ్’ను కేంద్ర ప్రభుత్వం తీసుకుని, అందుకు బదులుగా ఇచ్చిన స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించారని, నిజాం ఆస్తికి వారసత్వం తమకే ఉందని, ఆ ప్రకారం మొత్తం స్థలాన్ని తెలంగాణకే కేటాయించాలని వాదిస్తోంది.
అయితే, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌తో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని, కాబట్టి దానిని తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. దానిని తమకు ఇచ్చేస్తే పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని ఏపీ అధికారులకు సూచించారు.
తెలంగాణ అధికారుల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ఏపీ అధికారులు ఈ విషయంపై తమ సీఎం జగన్ తో చర్చించాక నిర్ణయం చెబుతామని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఏ ప్రతిపాదనైనా సరే జనాభా నిష్పత్తి ప్రకారమే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు తెలిసింది. దీంతో వచ్చేవారం మరోమారు సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు నిర్ణయించారు.