తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాలపైనా కన్నా నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై వ్యక్తిగత విమర్శలు, దూషణలతో కాలం గడుపుతుంది రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంతో దూషణలకు కొంత విరామం ఇచ్చినట్లయింది.
ఈ మధ్యలోనే పవన్ కళ్యాణ్ `వారాహి విజయ యాత్ర’ ప్రారంభించడం, అనూహ్యంగా లభిస్తున్న జనస్పందనతో వైసీపీ వర్గాలలో ఆందోళన చెలరేగడంతో మంత్రులు, వైసీపీ నేతలు, చివరకి వారి అజెండా పట్టుకున్న ముద్రగడ పద్మనాభం సహితం దూషణల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. ఇవేవీ ఆయన యాత్రపై ఎటువంటి ప్రభావం చూపుతున్న దాఖలాలు లేవు.
తాను రంగంలో లేకపోవడంతో ఆ విధంగా జరుగుతోందనే భావనతో, ‘ గురువారం రోజా `డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..!’ అంటూ వైసిపి శ్రేణులకు అభయం ఇచ్చారు. పైగా, తనకు ఆరోగ్యం బాగలేదని కొంతమంది సంతోషపడుతున్నారని అంటూ తాను లేకపోవడంతోనే పవన్ యాత్రకు అడ్డు లేకుండా పోయింది అన్నట్లు తిరుపతిలో మాట్లాడారు.
కొద్ది రోజులుగా రాజకీయ ప్రత్యర్థులపై దుర్భాషలు పలుకక పోవడంతో వెలితిగా భావిస్తున్నట్లున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ఒక రోజు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాని అంటారని.. మరొక రోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారని ఆమె ఎద్దేవా చేశారు.
అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్.. ఇంకా ప్రజల్లో ఎందుకు తిరుగుతూన్నారో అర్థం కావట్లేదని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఎందుకు జనసేన పార్టీ పెట్టాడో ఆయనికే తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఎం చేస్తారో చెప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై పవన్ చీప్‌గా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.
వైసిపి నేతల అరాచకాలు, దౌర్జన్యాలకు సమాధానంగా పౌరుషంగా, తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ పవన్ మాట్లాడాల్సి వచ్చిముడనే విషయం మర్చిపోయినట్లున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చింది సేవ చేయడానికా? లేక అధికార పార్టీ నేతలను కొట్టడానికా? అని మంత్రి రోజా ప్రశ్నించారు.
అమ్మవారి పేరు వాహనానికి పెట్టుకుని బూతుపురాణం చేబుతున్నారని.. ఈ క్రమంలో ప్రజల దృష్టిలో పవన్ విలన్‌గా మారుతున్నాడని ఆమె వాపోయారు. పైగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబును కాకుండా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలను పవన్ కళ్యాణ్ వింటే మంచిదని ఆమె హితవు పలికారు. అంటే తాము ఎవరితో కాలవల్లో, ఎవ్వరి మాటలు వినాలో అనేడిది కూడా రాజకీయ ప్రత్యర్ధులు వైసీపీ నేతలు చెప్పినట్లు చేయాలని రోజా భావిస్తున్నారా? “మీరు గుంపులుగా వచ్చినా, విడివిడిగా వచ్చినా 2024లో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే” అంటూ సవాల్ చేశారు.
అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఆమెను తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆమెకు మరోసారి సీట్ ఇస్తే అంతు చూస్తామని బహిరంగానే హెచ్చరికలు చేస్తున్నారని ఆమె మర్చిపోయినట్లున్నారు.