ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పెద్ద చిక్కు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర పోలీస్ లో తిరుగులేని అధికారిగా వ్యవహరిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సీఎం జగన్ ప్రసంశలు పొందుతూ వచ్చిన సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఇప్పుడు ఏ పోస్ట్ లేకుండా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న డిజిపి కె రాజేంద్రనాథ్ రెడ్డి కడప జిల్లాకు చెందిన అధికారి అయినా మెతకగా వ్యవహరిస్తున్నారని, తాము కోరుకుంటున్నట్లు రాజకీయ ప్రత్యర్థులను వేధించడం లేదని అసంతృప్తిలో సీఎం ఉన్నారు.
అందుకనే, సునీల్ కుమార్ ను డిజిపిగా చేస్తే, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ బూత్ లను కబ్జా చేసేందుకు, ప్రత్యర్థుల ప్రచారాలను అడ్డుకొనేందుకు అండగా ఉంటారనే ఎత్తుగడలు వేసుకొంటూ వస్తున్నారు. అయితే ఇంతలో అతనిపై చర్య తీసుకోవడం లేదని అంటూ కేంద్ర హోమ్ శాఖ నుండి గట్టిగా శ్రీముఖం రావడంతో ఏదో ఒక చర్య తీసుకొనక తప్పడం లేదు.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావును సర్వీస్ నుండి తొలగించేందుకు కేంద్రం అడ్డుతగిలింది. వీలుకాదని చెప్పుతూ, అవసరం అనుకుంటే క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చని సూచించింది. క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఆయన తిరిగి కోర్టుకు వెళ్లి రక్షణ పొందే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సునీల్ కుమార్ ను ఎంతగా కాపాడుదామనుకొంటున్నా చర్య తీసుకోవలసిందే అంటూ కేంద్రం పట్టుబడుతున్నది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తగు చర్య తీసుకొని, తనకు నివేదించామని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడం ద్వారా తన పనైపోయిన్నట్లు తప్పుకున్నారు. హిందూత్వానికి వ్యతిరేకంగా, హిందూ దేవతలకు వ్యతిరేకంగా సునీల్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారని మొదటగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
దానిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టు న్యాయవాది ఒకరు కూడా ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేయడంతో పాటు కేంద్రానికి లేఖ కూడా రాశారు. దీంతో ఏపీ ప్రభుత్వం స్పందించక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలకు సిద్ధమైంది.
మరోవంక, రఘురామకృష్ణంరాజును సిఐడి అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టించింది కూడా సునీల్ కుమార్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. అయినా, జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆయనను కాపాడుకుంటూ వచ్చింది. ఎటువంటి చర్యకు సిద్దపడటం లేదు.
ఇప్పుడు సునీల్ కుమార్ పై ఎటువంటి చర్య తీసుకోవాలా అన్నది జగన్ ప్రభుత్వమును వేధిస్తున్న ప్రశ్న. కఠిన చర్య తీసుకొంటే తిరగబడి తనచేత స్వయంగా ప్రభుత్వమే రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేయించింది అని చెబితే? ఎమ్యెల్యేగా కొడాలి నాని పనితీరు బాగాలేదని జగన్ చెప్పిన రోజే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో పరోక్షంగా జగన్ కుటుంబాన్ని లాగే ప్రయత్నం చేయడం ఈ సందర్భంగా గమనార్హం.
తమ ప్రయోజనాలకు అడ్డు తగిలితే సొంత మనుషులు అనుకొంటున్నవారే ఎదురు తిరుగుతూ ఉండడంతో సీఎం జగన్ ఒకరకమైన ఇరకాట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తున్నది.