డిఎస్ కాంగ్రెస్ లో చేరికపై కుమారుల మధ్య వార్!

Sunday, January 19, 2025

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పర్యాయాలు పిసిసి అధ్యక్షునిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన డి శ్రీనివాస్ ఆదివారం కాంగ్రెస్ లో చేరడం, 24 గంటలు గడవక ముందే సోమవారం కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు ఓ లేఖ రావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆయన ఇద్దరు కుమారుల మధ్య ఆస్తులకు జరుగుతున్న ఘర్షణలతో ఆయన నలిగిపోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో  పెద్ద కుమారుడు సంజయ్ తో కలసి ఆయన కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ రేవంత్‌తో పాటు వీహెచ్, ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ జరిపిన సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు.

అయితే, అనూహ్యంగా సోమవారం తన కుమారుడు సంజయ్ మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో చేరారని, అతనికి ఆశీస్సులు అందజేయటానికే గాంధీ భవన్‌కు వెళ్లినట్లు శ్రీనివాస్ చెప్పారు. తనకు కండువా కప్పి మళ్లీ పార్టీలో చేరినట్లుగా మీడియాలో ప్రచారం జరిగిందని పేర్కొంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు.

తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేని.., కానీ ప్రస్తుతం తన వయస్సు ఆరోగ్యం దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నట్లు చెప్పారు. ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరుకుంటున్నట్లు ఖర్గేకు రాసిన లేఖలో డి. శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

మరోవంక, శ్రీనివాస్ భార్య విజయలక్ష్మి కూడా మరో లేఖ విడుదల చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని.. తన భర్తను పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదంటూ కాంగ్రెస్ నేతల వైఖరిపట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి.. పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి మీ రాజకోయాలకు ఆయన్ను వాడుకోవద్దు” అంటూ ఆమె అభ్యర్ధించారు.

“మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్నా.. ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి” అని విజయలక్ష్మీ లేఖలో పేర్కొన్నారు.

అయితే ఈ రాజీనామా వ్యవహారం అంతా తన తమ్ముడు, బిజెపి ఎంపీ డి అరవింద్ ఆడుతున్న డర్టీ పాలిటిక్స్ అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్‌పై కుట్ర జరుగుతోంది. డీఎస్‌కు ప్రాణహాని ఉంది. నాన్న చుట్టూ ఉన్న వాళ్లపై నాకు అనుమానం ఉంది. ఎంపీ అర్వింద్ మా నాన్నను బ్లాక్ మెయిల్ చేసి రాజీనామా లేఖపై సంతకం చేయించారు” అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

“ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారు. డీఎస్ రాజీనామా చేసిన సంతకం ఫేక్. నాన్నను రూమ్‌లో బంధించి బలవంతంగా సంతకం చేయించుకున్నారు. మా నాన్నతో నా ఫోన్ లిఫ్ట్ చేయించడం లేదు. ఏం జరుగుతోందో తెలియక మాకు ఆందోళనకరంగా ఉంది. రౌడీలు, డబ్బును అడ్డు పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానుఅని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

“మా నాన్న కట్టర్ కాంగ్రెస్.. నేను కట్టర్ బీజేపీ వాడినే. ఆయన ఎక్కడున్నా కాంగ్రెస్ వాదే” అంటూ అరవింద్ స్పష్టం చేశారు. అ”యితే, ఆయన 2018 నుంచి పార్టీలో చేరతానంటే.. మీరు తీసుకోలేదు.. ఎందుకు తీసుకోలేదో నాకు తెలియదు. సోనియాగాంధీ  కుటుంబానికి 40, 45 ఏళ్లు సేవచేశారు. కనీసం ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకోలేదు” అంటూ కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు.

“స్వయంగా ఇంటికొచ్చి పార్టీలో చేర్చుకుంటే బావుండేది. కానీ, డీఎస్ లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటప్పుడు.. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.. హైపర్ టెన్షన్ ఉంది.. డైలీ ఫిట్స్ వస్తున్నాయి. పెరాలిసిస్ కూడా ఉంది. ఆయన బాత్రూమ్‌కు కూడా సరిగ్గా పోలేని వ్యక్తిని.. గాంధీ భవన్‌కు తీసుకెళ్లి ఆయనెవరో మాణిక్‌రావ్ ఠాక్రే అంట కండువా కప్పారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఎస్ కుమారులు ధర్మపురి అర్వింద్, సంజయ్ లు ఇద్దరికీ మధ్య చాలా కాలంగా విరోధం కొనసాగుతుంది. అరవింద్ బీజేపీలో చేరినా సంజయ్ కాంగ్రెస్ లోనే ఉంటూ వచ్చారు. నిజామాబాద్ మేయర్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సీట్ ఆశిస్తున్నారు. పార్టీ అనుమతిస్తే నిజామాబాద్ ఎంపీగా తమ్ముడిపై పోటీ చేయడానికి సిద్ధం అంటూ ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles