టెన్త్ పేపర్ లీక్ పై బీజేపీ మౌనం.. వరంగల్ సీపీ లక్ష్యంగా దాడులు!

Monday, December 23, 2024

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మాదిరిగా కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినా బిజెపి భంగపడింది. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ కేసులో మొదటి నిందితుడిగా అరెస్టు అయి జైలుకు వెళ్ళవలసి వచ్చింది.

అనూహ్యంగా సుమారు ఎనిమిది గంటలపాటు విచారణ జరిపి, రాత్రి పది గంటల సమయంలో హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం జైలు నుండి బైటకు వచ్చిన సంజయ్ గాని, ఇతర బిజెపి నాయకులు ఇప్పుడు టెన్త్ పేపర్ లీకేజి గురించి మాట్లాడటం లేదు. అసలు దోషులు ఎవ్వరో తేలుస్తామని చెప్పడం లేదు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పోరాటం కొనసాగిస్తామని, అందులో కీలక నిందితుడిగా ఆరోపిస్తున్న మంత్రి కెటిఆర్ ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసేవరకు ఊరుకోమని అంటూ ఒక విధంగా టెన్త్ లీకేజి నుండి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, అదే సమయంలో ఈ కేసులో సంజయ్ కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

సంజయ్ జైలు నుండి విడుదకాగానే పోలీస్ కమీషనర్ పై ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. “వరంగల్ కమీషనర్ కు తెలివి ఉందా? మీ చేతకానితనాన్ని మాపై నెడతారా? కమీషనర్ .. మీ సంగతి తేలుస్తాం… నల్లగొండ సహా ఇతర జిల్లాల్లో ఏమేం చేశారో అన్ని బయటకు తీస్తాం…. ” అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు.

“సంజయ్ సెల్ ఫోన్ ఇస్తే సంగతులు అన్ని బయటపడతాయి” అని కమీషనర్ రంగనాథ్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ “నా సెల్ ఫోన్ తో మీకు ఏం అవసరం?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “లీకుతో నాకు సంబంధం లేదని నా పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తా.. సిపి… నేను కుట్ర చేసినట్లు ప్రమాణం చేసే దమ్ముందా? పోలీసులే మీ తీరుతో తలదించుకొంటున్నారు” అంటూ వ్యక్తిగత సవాళ్లకు దిగారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ అయితే నేరుగా కమీషనర్ ను ప్రస్తావించకుండా “మీరు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ చెప్పిన్నట్లు ఆడుతున్నారు. మీరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలి తప్ప కేసీఆర్ చెప్పిన్నట్లు కాదు… ” అంటూ అరెస్ట్ గురించి విమర్శలు గుప్పించారు.

మరోవంక, సంజయ్‌ను అరెస్టు చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌ను  సెంట్రల్ హైదరాబాద్‌లోని బిజెపి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ 

నీలం భార్గవ రామ్ ట్విట్టర్‌లో బెదిరించారు.

 ‘కమీషనర్@cpwrl, మీ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఉత్తమంగా ప్రయత్నించండి, మీ కాల్ లాగ్‌లతో సహా ప్రతిదీ విచారించబడుతుంది. బండి సంజయ్‌ను తప్పుడు కేసులో ఇరికించాలని మిమ్మల్ని ఎవరు ఆదేశించారో అన్న దానిపై దర్యాప్తు జరుగుతుంది. ఢిల్లీలో ఉన్న బిసి కమిషన్ ఈ కేసును పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకు రాగలదు’ అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ బిజెపి సభ్యుడి ప్రకటనను ప్రశ్నించారు. దిలీప్ ట్వీట్ చేస్తూ ‘నిజాయితీ, నిబద్ధత కలిగిన పోలీసు అధికారులను బహిరంగంగా బెదిరించడం, దుర్భాషలాడడం బిజెపి కొత్త ఆచారమా? మొన్న బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు దుర్భాషలాడారు, ఇప్పుడు మరో బిజెపి కార్యకర్త బెదిరిస్తున్నారు. అంతా గమనిస్తున్నాం’ అంటూ హెచ్చరించారు.

బండి సంజయ్ మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ని వ్యక్తిగత దూషణ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఏ పోలీసు ఉద్యోగి, ఏ కేసులోనూ ప్రత్యేకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. మేము విధుల్లో చేరేటప్పుడే నిజాయితీతో,  నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవచేస్తామని ప్రతిజ్ఞ చేస్తాము. అలాంటిది కమిషనర్ ని ప్రమాణం చేయమని అడగడం అసంబద్ధమైన విషయం” అంటూ స్పష్టం చేశారు.

రంగనాథ్ పనితీరును గతంలో తాను పనిచేసిన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని సామాన్య ప్రజానీకాన్ని అడిగినా తెలుస్తుంది. లేదంటే ఆయా జిల్లాల్లోని బీజేపీ కార్యకర్తలను అడిగినా వాస్తవాలు తెలుస్తాయని హితవు చెప్పారు. పోలీసు వ్యవస్థ అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తుందని, దీనికి సంబంధించిన మీ అభ్యంతరాలను న్యాయస్థానాల్లో తేల్చుకోవాలిగాని, చట్టబద్దంగాని ప్రమాణాలను చేయమని కోరడం అశాస్త్రీయం, అసంబద్ధం అని వెల్లడించారు.

“పోలీసు అధికారులు, సిబ్బంది విశ్వసనీయతను ప్రశ్నించే మీ వైఖరిని మార్చుకోవాలని, పోలీసు కమిషనర్ రంగనాథ్ మీద చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని గోపిరెడ్డి సంజయ్ ను కోరారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles