టెన్త్ పేపర్ లీకేజి లో బండి సంజయ్ అరెస్ట్

Saturday, September 7, 2024

ఇప్పటికే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనంగా మారడం, ప్రతిపక్షాలు మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుండడంతో కేసీఆర్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, సోమవారం నుండి ప్రారంభమైన 10వ తరగతి ప్రశ్నల పత్రాలు సహితం ప్రతి రోజూ లీక్ అవుతూ ఉండటం అధికార పక్షం బిఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడవేస్తుంది.

అయితే అనూహ్యంగా ఈ లీకేజిలో రాష్ట్ర బండి సంజయ్ ను తెలంగాణ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ లోని ఆయన ఇంటివద్ద అరెస్ట్ చేయడంతో మొత్తం వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది.

తొలుత అర్ధరాత్రి ఆయన హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తూ సిద్దిపేటలోని రంగధాంపల్లి అమర వీరుల స్తూపం వద్ద మీడియాతో మాట్లాడతానని ప్రకటించారు. దీంతో మీడియా ప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రంగధాం పల్లి వద్దకు రాగానే అక్కడి పరిస్థితిని చూసిన బండి సంజయ్‌ తనను అడ్డుకుంటారనే భయంతో ఆగకుండానే ముందుకు వెళ్లిపోయారు.

దీంతో అక్కడ చేరిన వారంతా ‘బండి దొంగ.. దొంగ.. పారిపోతున్నాడు, అరెస్టు చేయండి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, బండిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకొని నానా హంగామా సృష్టించారు. దీంతో పోలీసులను భారీగా మోహరించి బండి సంజయ్‌ని అక్కడి నుంచి బొమ్మలరామం పోలీస్ స్టేషన్ కు తరలించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం పదోతరగతి హిందీ పేపర్‌ను పరీక్ష కేంద్రం నుంచి బయటకు తెచ్చిన వ్యవహారంలో ప్రధాన నిందితుడైన బీజేపీ కార్యకర్తగా పేర్కొంటున్న మాజీ జర్నలిస్ట్ బూరం ప్రశాంత్‌.. ఆ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్‌కి వాట్సాప్‌ద్వారా పంపినట్టు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం కూడా ప్రశాంత్‌తో బండి సంజయ్‌ ఫోన్లో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయి. దీంతో బండిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నా రు.
కాగా, సోమవారం నుండి ప్రారంభమైన పదో తరగతి పేపర్లు లీక్ కావడం ప్రభుత్వాన్ని మరింత విమర్శలపాలు చేస్తుంది. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ లో  తెలుగు పేపర్ లీక్ కాగా, మంగళవారం వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయ్యింది. ఇవ్వన్నీ పరీక్ష ప్రారంభమైన తర్వాత వాట్స్ అప్ గ్రూప్ ల ద్వారా బయట పడటం గమనార్హం. అందుకనే ఈ లీక్ ల వెనుక రాజకీయ కోణం ఉండిఉండొచ్చని అధికార పక్షం అనుమానాలు వ్యక్తం చేసింది.

‘పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ’ అనే గందరగోళాన్ని సృష్టించి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై బురద చల్లడానికి పన్నాగం పన్నిందా? అంటూ అధికారపక్షం నేతలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నాటి హిందీ పేపర్‌ లీకేజీతో కుట్ర మొత్తం బీజేపీ కనుసన్నల్లోనే సాగుతున్నదని విస్పష్టంగా బయటపడిందని ఆరోపిస్తున్నారు.

పైగా,  హిందీ పేపర్‌ లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్‌ను విడుదల చేయాలంటూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్‌ పోలీస్ కమిషనరేట్‌ వద్ద ఆందోళన చేయడం బీజేపీకి, నిందితుడికి మధ్య సంబంధాలను తేటతెల్లం చేస్తున్నదని పేర్కొంటున్నారు.

అయితే, తమ ప్రభుత్వ వైఫల్యాల నుండి యువత, విద్యార్థులలో పెబుల్లికిన ఆగ్రహాన్ని దారిమళ్లించడం కోసం బిజెపిపై నేరారోపణ చేస్తూ సరికొత్త నాటకం బిఆర్ఎస్ నాయకులు ఆడుతున్నారంటూ బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.   అరెస్ట్ చేసి ఇప్పుడు కారణాలకు వేడుకుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు జరపాలని పార్టీ పిలుపిచ్చింది.

పోలీసుల కధనం ప్రకారం బూరం ప్రశాంత్‌ ఓ బాలుడిని రెచ్చగొట్టి కమలాపూర్‌ నియోజకవర్గం ఉప్పల్‌లోని ప్రభుత్వ స్కూల్‌ పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్న పత్రాన్ని బయటికి తెప్పించాడు. ఆ తర్వాత ఉదయం 10:46 గంటల నుంచి వాట్సాప్‌ గ్రూపులకు చేరవేశాడు. పేపర్‌ లీక్‌ అయ్యిందని స్వయంగా బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ వార్త రాసి వరంగల్‌ మీడియా గ్రూపుల్లో వేశాడు.

హైదరాబాద్‌లోని పలువురు బ్యూరో ఇన్‌చార్జిలకు సైతం బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ పంపించాడు. ఉదయం 11:10 గంటలకు ప్రశాంత్‌ స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి వాట్సాప్‌లో హిందీ పేపర్‌ను పంపించాడు. ప్రశ్నపత్రం తన చేతికి వచ్చిన తర్వాత రెండుగంటల వ్యవధిలో ప్రశాంత్‌ ఏకంగా 142 ఫోన్‌ కాల్స్‌ మాట్లాడాడు. పేపర్‌ లీకైనట్టు వార్తలు ప్రసారం చేయాలని మీడియా ప్రతినిధులకు ఫోన్‌ చేసి చెప్పాడు.

వందలమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా బృందాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని చేరవేసి, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగేలా చేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియాలో స్క్రిప్టులు రాసి పోస్టు చేశారు.

కాగా, హిందీ ప్ర‌శ్నప‌త్రం లీక్ కాలేద‌ని, ప్రశ్నాపత్రం  బ‌య‌ట‌కు మాత్ర‌మే వ‌చ్చింద‌ని, అది కాపీ మాత్రమే అని వ‌రంగ‌ల్ పోలీస్ కమీషనర్ రంగ‌నాథ్  స్ప‌ష్టం చేశారు. 

పదో తరగతి పేపర్ కాపీయింగ్‌ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మంగళవారం సాయంత్రమే డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం హిందీ పేప‌ర్ కాపీయింగ్ కేసులో ముఖ్య నిందితుడు బండి సంజ‌య్‌కు స‌న్నిహితుడు అని పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles