టెన్త్ పేపర్ లీకేజిలో కీలకంగా బండి సంజయ్ మొబైల్ ఫోన్!

Saturday, November 16, 2024

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తున్న పదో హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మొత్తం సూత్రధారి కరీంనగర్ ఎంపి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అని ఆరోపించడమే కాకుండా,  ఆయన కనుసన్నల్లోనే ప్రణాళిక ప్రకారం పదో తరగతి ప్రశ్నాపత్రాలను లీకేజీ చేశారని అంటూ ఎఫ్ఐఆర్ లో ఆయనను మొదటి నిందితుడిగా వరంగల్ పోలీస్ లు పేర్కొన్నారు.

ఈకేసులో వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్స్‌లు విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల సహాయంతో పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా సాంకేతిక ఆధారాల సేకరణలో బండి సంజయ్ మొబైల్ ఫోన్ కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే తన మొబైల్ పోయిందని సంజయ్ చెబుతున్నారు.

ఆ ఫోన్ దొరికితే ఈ కేసుకు మాత్రమే కాకుండా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఎమ్యెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన పలు కీలకమైన సాక్ష్యాధారాలు లభించే అవకాశం ఉన్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో సంజయ్ ను కీలక నిందితుడిగా పేర్కొనడానికి ఈ మొబైల్, అందులో జరిపిన చాటింగ్ కీలక ఆధారంగా పోలీసులు పేర్కొంటున్నారు. ఆయనను టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కూడా చేర్చే అవకాశం లేకపోలేదని తెలుస్తున్నది. 

కాగా, సంజయ్ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో తమకు తెలియదని సంజయ్ భార్య అపర్ణ సహితం చెబుతున్నారు. అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆయన ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారని,  తోపులాటలో సెల్ ఫోన్ పడిపోయిందేమోనని అపర్ణ పేర్కొన్నారు. సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉందో పోలీసులకే తెలియాలని అంటూ ఆమె ఎదురు ప్రశ్న వేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితుడు ప్రశాంత్‌, ప్రధాన నిందితుడు బండి సంజయ్‌ మధ్య విస్తృతంగా ఫోన్‌కాల్స్‌ సంభాషణ జరిగినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రశాంత్‌ ఒక్క బండి సంజయ్‌తో మాత్రమే దాదాపు వందకు పైగా కాల్స్‌ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. పేపర్‌ లీకేజీలోనే వందలసార్లు మాట్లాడుకుంటే, పరీక్షకు ముందు వీరు ఎన్నిసార్లు మాట్లాడుకొని ఉంటారు? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

హిందీ ఎగ్జామ్ మొదలైన కొంత సమయానికే నిందితుడు క్వశ్చన్ పేపర్ ఫొటో తీసి వాట్సాప్‌లో షేర్ చేశాడు. అందరి లాగే బండి సంజయ్ కు పేపర్ వాట్సప్ చేశాడని బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఈటెల రాజేంద్రతో పాటు అనేకమందికి షేర్ చేసినా వారిని నిదనిథులుగా పేర్కొనడం లేదు గదా అని వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ ప్రశ్నిస్తున్నారు.

కానీ ఎగ్జామ్ ముందురోజు చాటింగ్, ఫోన్ కాల్స్, ఎగ్జామ్ జరుగుతున్న సమయంలోనూ సంజయ్, నిందితుడు ప్రశాంత్ ఫోన్ కాల్స్, వాట్సప్ ద్వారా కాంటాక్ట్ లో ఉన్నారని స్పష్టం అవుతుంది. పేపర్ లీక్ తరువాత సరే , ఓ రోజు ముందు బండితో ప్రశాంత్‌కు ఏం పని? ఏం మాట్లడారు? పేపర్ లీక్ పై చర్చించారా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మంగళవారం బండి సంజయ్‌కు పేపర్‌ పంపించిన తర్వాత కూడా ప్రశాంత్‌ కాల్‌ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. వీరు ఎక్కువగా వాట్సాప్‌కాల్స్‌ చేసుకోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. ఈ వాట్సాప్‌ కాలింగ్‌లో బండి సంజయ్‌ ఒక్కరే ఉన్నారా? ఇంకా ఎవరైనా బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పేపర్‌ లీకేజీలో పోలీసులు తమ ఇంటిని చుట్టుముట్టడంతో తన అరెస్టు తప్పదని భావించిన సంజయ్‌ తన రెండో ఫోన్‌ను రహస్యంగా దాచినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ ఫోన్‌ను వెతికేందుకు లేదా అందులోని సమాచారాన్ని వెలికి తీసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫోన్‌ దొరికితే వరస లీకేజీలకు సంబంధించిన కీలక సమాచారం దొరికే అవకాశమున్నదని పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పటికే ప్రశాంత్‌ వాట్సాప్‌ చాట్‌ను రిట్రివ్‌ చేశారు. అందులోని కీలక సమాచారం ఆధారంగా బండి దాచిన మరో ఫోన్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో అతని చేతిలో ఫోను ఉన్నది. అదుపులోకి తీసుకున్న వెంటనే ఫోన్‌ను తన అనుచరులకు ఇచ్చి దాచిపెట్టించినట్టు భావిస్తున్నారు. ప్రశాంత్‌ ఫోన్‌ నుంచి కేవలం రెండు గంటల్లోనే బీజేపీ నేతలకే దాదాపు 142 ఫోన్‌కాల్స్‌ వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు.

ఇలా ఉండగా, టెన్త్ పరీక్షలు  ప్రారంభమైన సోమవారం, మరుసటి రోజు మంగళవారం కూడా ప్రశ్నాపత్రాలు లీక్ కాగా, ఈ కేసును ఛేదించి, అరెస్టులు ప్రారంభించిన తర్వాత బుధ, గురువారాలలో సాఫీగా పరీక్షలు జరగడం గమనార్హం. దొంగ‌ల్ని అరెస్టు చేసి జైల్లో వేసిన త‌ర్వాత ఇవాళ ఏ లీక్ లేదు.. పది ప‌రీక్ష‌ల సాఫీగా సాగుతున్నాయ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు బీజేపీ నేత‌లు చేస్తున్న కుట్రలలో భాగం ఈ లీకేజి అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles