టీడీపీ ముఠాలు అప్పుడే బుసలు కొడుతున్నాయే!

Wednesday, January 22, 2025

‘రాజకీయాల్లో హత్యలుండవు.. అన్నీ ఆత్మహత్యలే’ అనే నానుడి ఊరికే పుట్టలేదు. నూటికి వెయ్యిశాతం వాస్తవం అది. రాజకీయాల్లో నాయకులైనా తమ అహంకారం, దుడుకుతనంతో తమ పతనాన్ని తామే శాసించుకుంటూ ఉంటారు. పార్టీలైనా ముఠా కుమ్ములాటలు, సర్దుకుపోలేని వైఖరులతో తమను తాము సర్వనాశనం చేసుకుంటూ ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ యుద్ధానికి సిద్ధం అవుతుండగా.. ఆ పార్టీలోని ముఠాలు అప్పుడే మోరఎత్తి చూస్తున్నాయి. బుసలు కొడుతున్నాయి. ఉత్తరాంధ్ర తెలుగుదేశంలోని భిన్నధ్రువాలు దూషణల్తో పార్టీని బజారులోకి లాగుతున్నాయి.
విశాఖపట్నంలోని టీడీపీ నాయకులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య సుదీర్ఘకాలం వైరం ఉంది. వారి మధ్య వైరం ఉంటే..పార్టీలో అంతర్గతంగా వారూ వారూ తేల్చుకోవాలి. కానీ.. పార్టీ పరువు పోయేలా బహిరంగ విమర్శలతో చెలరేగడం పార్టీకి నష్టదాయకం. 2019 ఎన్నికల్లో పార్టీ పరాభవం చెందిన తర్వాత గంటా శ్రీనివాసరావు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. అసలు గంటా తెలుగుదేశంలో ఉన్నారా? లేదా? అనే సందేహాలు కలిగేంతగా ఆయన పార్టీకి దూరమయ్యారు. ఆయన తెదేపాను వీడిపోతారని, బిజెపిలోకి వెళ్తారని, వైసీపీలోకి వెళ్తారని రకరకాల పుకార్లు పలుమార్లు వచ్చాయి. ‘ఏ సంగతీ సమయం వచ్చినప్పుడు చెప్తా’ అనే మాటలతో గంటా సస్పెన్స్ ను కొనసాగిస్తూ వచ్చారే తప్ప.. తన రాజకీయ ప్రస్తానం తేల్చలేదు.
ఈ క్రమంలో ఇటీవల ఆయన ఎన్టీఆర్ ను కీర్తించడం, పార్టీకి తిరిగి దగ్గరకావడానికి ప్రయత్నించడం జరిగింది. దీనిపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక రేంజిలో ఫైర్ అయ్యారు.‘గంటా శ్రీనివాసరావు ఏమైనా పెద్దనాయకుడా? ప్రధానా? లక్షలాది మంది జనంలో ఆయన ఒకడు’ అంటూ విరుచుకుపడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంటనిలిచిన వారు మాత్రమే నిజమైన పార్టీ కార్యకర్తలని ఎద్దేవా చేశారు. పార్టీని కాపాడుకోవడం కోసం ఎవరు వచ్చినా తనకు అభ్యతరం లేదని అంటూనే.. దొంగవేషాలొద్దు, దొంగపనులొద్దు.. ’ అంటూ గంటా వైఖరిని ఎద్దేవా చేశారు.
ఇద్దరు విశాఖనాయకుల మధ్య ఉన్న విభేదాలు ఇలా పార్టీ పరువు తీసే పరిస్థితికి రాకుండా ఉండాల్సింది. పార్టీలో ముఠాలు ఉంటే.. పార్టీ పరువు తీసేలా బజార్న పడి మాటలు అనుకోకుండా.. అంతర్గతంగా చూసుకోవాలనే క్రమశిక్షణ ఉండాలి. చంద్రబాబునాయుడు ఈ మేరకు పార్టీకోసం జాగ్రత్తలు తీసుకోవాలి. నాయకులు ఎవరి తీరుకు వారిని వదిలేస్తే.. నష్టపోయేది పార్టీనే తప్ప నాయకులు కాదు. అసలే చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న ఈ ఎన్నికల సమయంలో నాయకులే ఇలా ఒకకరినొకరు కించపరుచుకుంటూ ఉంటే.. ఎన్నికల్లో విజయం కష్టమవుతుందని కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles