టీడీపీతో పొత్తుపై బీజేపీ నేతలలో గందరగోళం!

Wednesday, January 22, 2025

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 తరహా పొత్తులను టీడీపీ కోరుకుంటోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపింది. మరో తమతో పొత్తు ఉందని బీజేపీ నాయకులు చెప్పుకొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహితం బహిరంగంగానే టిడిపితో పొత్తుకు సై అంటున్నారు. టిడిపితో చేతులు కలపకుండా వైసిపిని ఓడించలేమని స్పష్టం చేస్తున్నారు.

నోటా కన్నా తక్కువగా ఓట్లున్న ఏపీలో తమకు ఒక సీట్ కూడా గెల్చుకొనే పరిస్థితి లేకపోయినా ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమతోనే ఉంటారనే భరోసాతో ఉన్న బీజేపీ నాయకత్వం తెలంగాణ విషయంలోనే సీరియస్ గా ఆలోచిస్తున్నది.

ఇక్కడ అధికారంలోకి వచ్చేది తమ పార్టీయే అని చెప్పుకొంటున్న నాయకులే మరోవంక బలమైన అభ్యర్థుల కోసం ఇతర పార్టీల వారిని ఆకట్టుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. అంటే, కనీసం ఎన్నికలలో పోటీ చేయడానికి సహితం అభ్యర్థులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటున్నారు.
రాజకీయంగా తెలంగాణాలో టిడిపి ఉనికి ప్రశ్నార్ధకంగా మారినప్పటికీ ఆ పార్టీకి ఇంకా మద్దతుదారులు బిజెపి కన్నా ఎక్కువగా తెలంగాణాలో ఉన్నారని బీజేపీ నాయకత్వంకు కూడా తెలుసు. వారు కాంగ్రెస్, బిజెపిలను `శత్రువులు’గా చూస్తున్నారని, వారు ఓట్లు వేయడంతోనే గత ఎన్నికలలో కేసీఆర్ అనూహ్య విజయం సాధించారని కూడా తెలుసు. 

ఖమ్మంలో చంద్రబాబు నాయుడు బహిరంగసభకు ఎవ్వరూ ఊహించని స్పందన లభించడంతో ఇప్పుడు ఆ పార్టీతో పొత్తుపై బిజెపి అంతర్గతంగా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇటువంటి సమయంలో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలిగే లాభ నష్టాల పైన ఆలోచన చేస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ చెప్పిన్నట్లు వచ్చిన కధనాలు బీజేపీలో తీవ్ర దుమారం రేపాయి.

బీజేపీలో బలమైన వర్గాలు మాత్రం టిడిపితో పొత్తు లేకుండా రాజకీయంగా ఎంతో నష్టపోతామని రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నాయకత్వం, అక్కడ వైఎస్ జగన్ తో, ఇక్కడ సీఎం కేసీఆర్ తో కుమ్మక్కు రాజకీయాలు జరుపుతున్న బిజెపి నాయకులు మాత్రం `ఒంటరిగా పోటీ’ చేద్దామని వత్తిడి తెస్తున్నారు.

అందుకనే, తరుణ్ ఛుగ్ తన పేరుతో వార్తాకథనాలు రాగానే వెంటనే ఖండించారు. తాను అనని మాటలను అన్నట్టు వ్రాసారని, ఇదంతా ఓ కుట్ర అంటూ చెప్పుకొచ్చారు. అంటే తనతో సంభాషణలు జరిపిన తర్వాత అటువంటి కధనాలు వ్రాసారని ఒప్పుకోవడం గమనార్హం. రాజకీయ వత్తిడుల కారణంగా ఖండన ఇచ్చిన్నట్లు స్పష్టం అవుతుంది.

అయితే, తెలంగాణాలో ఎన్నికలపై చూపగల టిడిపి బలం గురించి ఇంకా స్పష్టత ఏర్పడక పోవడం కూడా బిజెపి గందరగోళానికి ఓ కారణంగా కనిపిస్తున్నది. ఈ విషయమై స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అంతర్గత సర్వేలు చూపిస్తున్నట్లు తెలుస్తున్నది.

అదే విధంగా వైఎస్ షర్మిల విషయంలో సహితం కేసీఆర్ ప్రభుత్వం ఆమెను అమానుషంగా అరెస్ట్ చేసిన సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరామర్శించడం యధాలాపంగా జరిగింది కాదని బిజెపి వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆమెను ఓ ఆయుధంగా ప్రయోగించేందుకు బిజెపి సిద్ధపడుతున్నట్లు వెల్లడి అవుతుంది.

ప్రస్తుతం తెలంగాణ ఇన్ ఛార్జ్ లుగా వ్యవహరిస్తున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్ తో పాటు సునీల్ బన్సల్ సహితం తెలంగాణాలో ఒంటరిగా బిజెపి చెప్పుకోదగిన సీట్లు గెల్చుకొనే పరిస్థితులు లేవని నిర్ధారణకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. బిజెపికి ఎల్యేల్యే సీట్లు గెలుపొందడం కన్నా ఎంపీ సీట్లు ఎక్కువగా గెల్చు కోవడం అత్యవసరం కాగలదు. అందుకనే టిడిపితో పొత్తు లేకపోయినా ఆ పార్టీని దూరం చేసుకొంటే తెలంగాణాలో భారీ మూల్యం చెల్లించక తప్పారని పలువురు బిజెపి నేతలు అంగీకరిస్తున్నారు.

ఏపీలో సహితం వైఎస్ జగన్ ప్రాబల్యం నానాటికి తగ్గుతున్నట్లు, జగన్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లు స్పష్టం అవుతూ వస్తున్నది. జగన్ తిరిగి గెలుపొందడానికి ఎంతగా తోడ్పాటు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ జగన్ తో పాటు బీజేపీ కూడా మునిగిపోయే పరిస్థితులు ఏర్పడితే తట్టుకొనే పరిస్థితుల్లో లేరని మాత్రం స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles